అర్హులందరికీ అక్రిడిటేషన్లు: సమాచార కమిషనర్‌

ABN , First Publish Date - 2021-07-08T09:00:47+05:30 IST

పనిచేసే జర్నలిస్టులందరికీ తప్పనిసరిగా అక్రిడిటేషన్లు ఇస్తామని, ఈ విషయంలో అందరికీ న్యాయం చేస్తామని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ విజయకుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు

అర్హులందరికీ అక్రిడిటేషన్లు: సమాచార కమిషనర్‌

విజయవాడ, జూలై 7(ఆంధ్రజ్యోతి): పనిచేసే జర్నలిస్టులందరికీ తప్పనిసరిగా అక్రిడిటేషన్లు ఇస్తామని, ఈ విషయంలో అందరికీ న్యాయం చేస్తామని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ విజయకుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం విజయవాడలో తనను కలిసిన ఏపీయూడబ్ల్యూజే బృందానికి కమిషనర్‌ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆయా సమస్యలపై స్పందించిన కమిషనర్‌ మాట్లాడుతూ.. అక్రిడిటేషన్‌ జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, దరఖాస్తుల స్వీకరణకు, సవరణలకు తుదిగడువు ఏమీలేదన్నారు. పత్రికలకు జీఎస్టీ లేకున్నా ప్రింటింగ్‌ ప్రెస్‌కు ఉంటే దానిని పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్లు జారీ అయిన వెంటనే హెల్త్‌కార్డులు, ప్రమాద బీమా పథకాలు అమలు ప్రారంభిస్తామన్నారు.  కరోనాతో మృతిచెందిన పాత్రికేయుల కుటుంబాలకు 5లక్షల ఆర్థిక సహాయంపై ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్‌ హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ.. పెండింగ్‌ సమస్యలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో తమ యూనియన్‌ వివిధరూపాల్లో ఆందోళన చేపడుతుందని స్పష్టంచేశారు.

Updated Date - 2021-07-08T09:00:47+05:30 IST