గాల్లోనే అల్లల్లాడిన ఇండిగో

ABN , First Publish Date - 2021-12-15T08:22:06+05:30 IST

గాల్లోనే అల్లల్లాడిన ఇండిగో

గాల్లోనే అల్లల్లాడిన ఇండిగో

భయంతో కేకలు వేసిన ప్రయాణికులు

విమానంలో ఎమ్మెల్యేలు రోజా, వేగుళ్ల, టీడీపీ నేత యనమల

రాజమహేంద్రవరం నుంచి తిరుపతి ప్రయాణం

తిరుపతిలో ల్యాండింగ్‌ సమస్యతో గాల్లోనే చక్కర్లు

చివరికి బెంగళూరులో ల్యాండింగ్‌

ఐదు వేలు కడితేనే దిగనిస్తామన్న సిబ్బంది.. విమానంలో రచ్చ


రాజమహేంద్రవరం, తిరుపతి, అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): సైనిక హెలికాప్టర్‌ ప్రమాదాన్ని మరకవకముందే.. మరో విమానం ల్యాండింగ్‌ సమస్యతో గాల్లో చక్కర్లు కొట్టడంతో అందులోని 35 మంది ప్రాణ భయంతో అల్లాడిపోయారు. తిరుపతిలో దిగాల్సిన విమానం.. అటూ ఇటూ ఊగిపోతూ.. గాల్లోనే తిరుగుతూ.. ల్యాండింగ్‌ కోసం ప్రయత్నిస్తుండటంతో ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు బెంగళూరు విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ కావడంతో ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు.. అక్కడ విమానం తలుపులు తీయకపోవడంతో మరింత ఇబ్బందిపడ్డారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 9.15 గంటలకు 35మంది ప్రయాణికులతో 6ఇ-7265 నంబరు ఇండిగో విమానం బయలుదేరింది. ఇందులో టీడీపీ సీనియర్‌ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు జోగేశ్వరరావు, ఆర్కే రోజా తదితర ప్రముఖులు ఉన్నారు. ఈ విమానంతిరుపతిలో 10.20 గంటలకు దిగాల్సి ఉంది. అక్కడ విమానాన్ని దించేందుకు ప్రయత్నించగా.. వైబ్రేషన్‌ రావడంతో సుమారు 20 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. మళ్లీ ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. అప్పుడూ సాధ్యం కాకపోవడంతో, కాస్త దూరం తీసుకుని వెళ్లి 20 నిమిషాల తర్వాత మళ్లీ ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. ఇలా మూడుసార్లు ప్రయత్నించినా ల్యాండింగ్‌కు వీలు కాలేదు. విమానం గాల్లోనే తిరుతుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. కొంతమంది భయంతో పెద్దగా కేకలు వేశారు. సాంకేతిక లోపం వల్ల చిన్న సమస్య వచ్చిందని, కంగారు పడొద్దని పైలట్‌ ప్రయాణికులకు చెప్పారు. తర్వాత తిరుపతి నుంచి బెంగళూరుకు విమానాన్ని మళ్లించినట్టు తెలియజేసి, బెంగళూరు వైపు వెళ్లారు. 12.15 నిమిషాలకు విమానాన్ని బెంగళూరు విమానాశ్రయంలో దింపారు. సుమారు 2గంటలపాటు 35 మంది ప్రయాణికులు ప్రాణభయంతో గడిపారు.


విమానం కిందికి దిగినా.. ఇబ్బందులే! 

రెండు గంటలపాటు గాల్లోనే తిరిగిన విమానం.. చివరకు బెంగళూరులో ల్యాండ్‌ కాగానే.. ప్రయాణికులంతా దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అయితే విమానం తలుపులు తీసేందుకు సిబ్బంది అంగీకరించకపోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆపరేషన్‌ చేయించుకున్నామని, ఇంతసేపు కూర్చోలేమని, కిందకు దిగాలని ప్రయాణికులు అడిగితే ప్రయాణికులు ఒక్కొక్కరూ రూ. 5వేల చొప్పున చెల్లించాలని విమాన సిబ్బంది డిమాండ్‌ చేశారు. రూ.5 వేలు చెల్లిస్తే సెక్యూరిటీ సమస్య ఉండదా? అని ప్రయాణికులు వాదించడంతో ఎట్టకేలకు కిందికి దిగేందుకు అనుమతి ఇచ్చారు. విమానం తలుపులు తీసి విమానాశ్రయం లోపలికి పంపడానికి బస్సు ఎక్కించారు. ఆ బస్సులో కూడా అర గంటపాటు ఉంచారు. మళ్లీ గొడవ చేస్తే విమానాశ్రయం లోపలికి తీసుకువెళ్లారు. అప్పటికి మధ్యాహ్నం అయింది. ప్రయాణికులకు కనీసం భోజన ఏర్పాట్లు చేయకుండా.. ఒక చిన్న డ్రై ఫ్రూట్స్‌ ప్యాకెట్‌ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఆతర్వాత అదే విమానం బెంగళూరు నుంచి 2.36 గంటలకు బయలుదేరి ప్రయాణికులను తిరుపతి చేర్చింది. ఈ ఘటనపై ఆర్కే రోజా మాట్లాడుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన ఇండిగోపై డిఫమేషన్‌ సూట్‌ వేస్తానని చెప్పారు. విమానాన్ని మళ్లించిన ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగోలేదని యనమల రామకృష్ణుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-15T08:22:06+05:30 IST