ఆ స్కూళ్లలో.. వలంటీర్లే టీచర్లు!

ABN , First Publish Date - 2021-02-01T09:54:38+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను పరిష్కరిచేందుకు విద్యా వలంటీర్లను టీచర్లుగా ఎంపిక చేయాలని పురపాలక శాఖ యోచిస్తోంది.

ఆ స్కూళ్లలో.. వలంటీర్లే టీచర్లు!

  • మునిసిపల్‌ స్కూళ్లలో బోధన బాధ్యతలు
  • ఈ ఏడాది స్కూళ్లలో పెరిగిన అడ్మిషన్లు
  • ఉపాధ్యాయుల కొరతతో సర్కారు నిర్ణయం


అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను పరిష్కరిచేందుకు విద్యా వలంటీర్లను టీచర్లుగా ఎంపిక చేయాలని పురపాలక శాఖ యోచిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆదాయం తగ్గి, జీవనవ్యయం పెరిగిన పరిస్థితిలో ప్రైవేటు విద్యాసంస్థల నుంచి తమ చిన్నారులను మాన్పించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అదేసమయంలో చాలా మంది ‘అమ్మ ఒడి’ కోసం కూడా ప్రభుత్వ పాఠశాలలవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో మున్సిపల్‌ స్కూళ్లల్లో విద్యార్థుల చేరికలు పెరిగాయి. ఈ ఏడాది కొత్తగా సుమారు 27,000 మంది విద్యార్థినీ విద్యార్థులు మున్సిపల్‌ స్కూళ్లలో ప్రవేశాలు పొందారు. వీరితో కలిపి ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య దాదాపు 3.43 లక్షలకు చేరింది. అయితే ఈ సంఖ్యకు తగిన విధంగా ఉపాధ్యాయులు లేరు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆన్‌లైన్‌ ద్వారా బోధన సాగడంతో ఉపాధ్యాయుల కొరత అంతగా ప్రభావం చూపలేదు. అయితే, గత ఏడాది నవంబరులో 9, 10 తరగతులు, గత నెలలో 6, 7, 8 తరగతులకు పాఠశాలలు తిరిగి ప్రారంభించారు. ఇక, సోమవారం నుంచి 1 నుంచి 5 తరగతులకు కూడా పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. ఇలా అన్ని తరగతులూ ప్రారంభమవుతుండడంతో ఉపాధ్యాయుల కొరత ప్రధాన సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కొత్తగా ఉపాధ్యాయులను నియమించుకునే పరిస్థితి కనిపించడం లేదు.


దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం విద్యా వలంటీర్లను నియమించుకుని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో బోధన సజావుగా జరిగేలా చూడాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో మున్సిపల్‌ పాఠశాలలకు సంబంధించిన వివరాలు సేకరిస్తోంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు టీచర్ల నిష్పత్తిని అంచనా వేస్తోంది. దీని ప్రకారం విద్యార్థులకు అవసరమైన మేరకు వలంటీర్లను నియమించనుంది. కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియను ముగించి, ఏయే పాఠశాలల్లో ఎందరు విద్యా వలంటీర్లు అవసరమవుతారో నిర్ధారించనుంది. అనంతరం వారి భర్తీకి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నారు. 

Updated Date - 2021-02-01T09:54:38+05:30 IST