బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , First Publish Date - 2021-07-12T08:00:10+05:30 IST

ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

బంగాళాఖాతంలో   అల్పపీడనం

2 రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు

అనేక చోట్ల తేలికపాటి జల్లులు

జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక


అమరావతి, విశాఖపట్నం, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా మీదుగా కోస్తాంధ్రలోని అల్పపీడన ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ఉంది. అలాగే తూర్పు-పశ్చిమ షీర్‌ జోన్‌లో కర్ణాటక తీరం నుంచి కాకినాడ తీరం వరకు వాయు సమ్మేళనం ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీంతో ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురిశాయి.


అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. కాగా... సోమ, మంగళవారాల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపాయి. తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్నందున రెండ్రోజులు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. 

Updated Date - 2021-07-12T08:00:10+05:30 IST