బూతులు తిడితే వెంటనే రియాక్షన్
ABN , First Publish Date - 2021-10-21T08:33:54+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కుటుంబసభ్యులు చూపించిన రియాక్షన్‌కు చంద్రబాబే బాధ్యత వహించి, క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.

దానికి చంద్రబాబే బాధ్యత వహించాలి: సజ్జల
అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కుటుంబసభ్యులు చూపించిన రియాక్షన్‌కు చంద్రబాబే బాధ్యత వహించి, క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. భవిష్యత్తులో తిట్టడం కోసమే వైసీపీ నేతలపై బూతులు మాట్లాడితే కచ్చితంగా రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరతామని తెలిపారు. ‘‘తిడితే చీమూనెత్తురూ ఉన్నోడు రియాక్టవుతాడు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. టీడీపీ నేతలు దానిని కూడా దాటేశారు. కావాలనే ముఖ్యమంత్రిపై పట్టాభి పరుష పదజాలం ఉపయోగించారు. ఉత్తర భారతంలో అది ఓ బూతు మాట. అది అనకూడనిది. దీనికి ‘కొడకా..’ అనేది అర్థం. సీఎంని ఉద్దేశించి ఈ పదం ఎందుకు వాడారో తెలియడం లేదు.
దీని వెనుక ఉన్న కర్త, కర్మ, క్రియా అంతా చంద్రబాబే’’నని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి బూతులు మాట్లాడితే మాత్రం రియాక్షన్ కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. చేతకాని దద్దమ్మలే బూతులు వాడతారని ఆగ్రహించారు. ‘‘మాట్లాడే స్వేచ్ఛ లేదా అని చంద్రబాబు ప్రశ్నిస్తారు.. ప్రజాస్వామ్య స్ఫూర్తి అని అంటారు.. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే లం...కొడకా.. అని తిట్టడమా? గంజాయి ఈ రెండున్నరేళ్లలోనే ఒక్కసారిగా వచ్చేసిందా? తెలంగాణలో అది లేనేలేదా?’’ అని ప్రశ్నించారు. కాగా, కరెంటు ట్రూఅప్ చార్జీలపై ఎవరి వాదనలు వారు వినిపిద్దామని సజ్జల పేర్కొన్నారు.