రుయాలో వ్యాక్సిన్ తీసుకున్న ఏడుగురు నర్సింగ్ విద్యార్థినులకు అస్వస్థత
ABN , First Publish Date - 2021-02-06T09:21:35+05:30 IST
తొలివిడత వ్యాక్సినేషన్‌లో భాగంగా తిరుపతి రుయాస్పత్రిలో కరోనా టీకా తీసుకున్న ఏడుగురు నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

తిరుపతి (వైద్యం), ఫిబ్రవరి 5: తొలివిడత వ్యాక్సినేషన్‌లో భాగంగా తిరుపతి రుయాస్పత్రిలో కరోనా టీకా తీసుకున్న ఏడుగురు నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి శుక్రవారం తెలిపారు. రుయాలో శుక్రవారం మొత్తం 130 మందికి వ్యాక్సిన్ వేశారు. వారిలో 47 మంది నర్సింగ్ విద్యార్థినులు ఉన్నారు. వాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే ఏడుగురు ఆస్వస్థతకు గురయ్యారు. వారిని 24 గంటలపాటు పర్యవేక్షణలో ఉంచి.. ఏ సమస్యా లేకపోతే డిశ్చార్జ్ చేస్తామన్నారు.
కొత్తగా 97 కరోనా కేసులు
అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 97 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33,876 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,88,275కి చేరుకుంది. కృష్ణా జిల్లాలో కరోనాతో ఒకరు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 7,158కి పెరిగింది.