నాదీ నీదీ అమరావతే!

ABN , First Publish Date - 2021-11-28T07:04:23+05:30 IST

నాదీ నీదీ అమరావతే!

నాదీ నీదీ అమరావతే!

నెల్లూరు వీధుల్లో మారుమోగిన నినాదం


నెల్లూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ‘మాది నెల్లూరు.. మా రాజధాని అమరావతి..’ అంటూ నగరం నినదించింది. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా లెక్కచేయక అమరావతి రైతులు అడుగులో అడుగేస్తూ ముందుకు కదిలారు. వారిని అనుసరిస్తూ స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం పాదయాత్ర జరిగిన 12 కిలోమీటర్ల పొడవునా పూలవర్షం కురిపించారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు జెట్టి శేషారెడ్డి కళ్యాణమండపం నుంచి మొదలైన పాదయాత్ర నెల్లూరు నగరంలోని  పలు కూడళ్ల మీదుగా సాయంత్రం అంబాపురంలోని శాలివాహన ఫంక్షన్‌ హాలు వద్ద ముగిసింది. పాదయాత్ర ప్రారంభ సమయానికి సీపీఎం నేత, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, మాదాల వెంకటేశ్వర్లు తదితర నాయకులు  కల్యాణమండపం వద్దకు చేరుకుని మద్దతు తెలిపారు.  టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌ ఆరంభం నుంచి పాదయాత్ర వెంట నడిచారు. మార్గమధ్యంలో డీసీసీ అధ్యక్షుడు దేవకుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తలు రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు.  ఆయన ఆధ్వర్యంలో బారాషాహీద్‌ దర్గాలో ప్రత్యేక పూజలు జరిపారు. దర్గా వద్ద ముస్లిం మత పెద్దలు వీరికి సంప్రదాయ స్వాగతం పలికారు. అమరావతి రాజధాని కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. రైతు నాయకులతో కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, బీద గిరిధర్‌ తదితరులు ప్రార్థనలు చేశారు. కాగా టీడీపీ నెల్లూరు నగర ఇన్‌చార్జ్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు కుమారుడు కోటంరెడ్డి ప్రజయ్‌సేనారెడ్డి అమరావతి జేఏసీ కన్వీనర్‌ తిరుపతి రాజుకు రూ.1లక్ష విరాళం అందించారు. 


అందరి భవిష్యత్తు కోసమే...

శనివారం పాదయాత్ర ముగింపు సందర్భంగా అమరావతి జెఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ తాము చేస్తున్న ఉద్యమం కేవలం అమరావతి ప్రాంత రైతుల కోసం మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కోసం కూడానని స్పష్టం చేశారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో శ్రీబాగ్‌ ఒప్పందాన్ని ప్రస్తావించడం సరికాదన్నారు. 


విదేశాల నుంచి విరాళాలు

అమరావతి, నవంబరు 27, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డ ప్రవాసాంధ్ర రైతు బిడ్డలు...అమరావతి రైతుల పాదయాత్ర, పోరాటానికి అండగా నిలిచారు. అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్ర రైతు బిడ్డలు 256మంది కలిసి ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేశారు. ఒక్కొక్కరు 500 డాలర్ల చొప్పున అమరావతి జేఏసీకి ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం 24గంటల్లోనే అంతా స్పందించి ఈ విరాళాలు ఇచ్చారు. 

మొత్తం కోటి రూపాయలు విరాళంగా రాగా...అందులో రూ.54లక్షలను తొలి విడతగా అమరావతి జేఏసీకి పంపించారు. మరోవైపు యూకేలోని ప్రవాసాంధ్రులు కొంతమంది కలిసి రూ.5లక్షలు విరాళంగా అందించారు. అమ్మినేని భాస్కర్‌రావు, నరేశ్‌కుమార్‌ మల్లినేని, ఇతరులు కలిసి ఈ మేరకు అమరావతి పరిరక్షణ జేఏసీకి విరాళాన్ని పంపించారు. 

Updated Date - 2021-11-28T07:04:23+05:30 IST