కరోనా కట్టడి చర్యలతో ప్రజాస్వామ్యం వెనుకడుగు

ABN , First Publish Date - 2021-11-23T09:45:19+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం వెనుకడుగు వేసిందని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ ఎలక్టోరల్‌ అసిస్టెన్స్‌

కరోనా కట్టడి చర్యలతో ప్రజాస్వామ్యం వెనుకడుగు

దేశాల్లో అప్రజాస్వామిక, అనవసర నియంత్రణలు: ఐడీఈఏ నివేదిక


కోపెన్‌హెగెన్‌, నవంబరు 22: కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం వెనుకడుగు వేసిందని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ ఎలక్టోరల్‌ అసిస్టెన్స్‌ (ఇంటర్నేషనల్‌ ఐడీఈఏ) అనే సంస్థ రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. కరోనాను నియంత్రించడానికి ప్రభుత్వాలు అప్రజాస్వామిక, అనవసర చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. నియంతృత్వ దేశాల్లో పరిస్థితులు మరింత దిగజారాయని పేర్కొంది. భావ ప్రకటనా స్వేచ్ఛపై నియంత్రణలు పెరిగాయని, చట్టబద్ధంగా పాలించడంలో అనేక దేశాలు విఫలమయ్యాయని వెల్లడించింది. స్వీడన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ మొత్తం 34 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసింది. వాటిలో 64 శాతం దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు, ఆచరణ బలహీనమైనట్టు నివేదిక పేర్కొంది. గతేడాది వరకు తీసుకుంటే... ఎక్కువ దేశాల్లో ప్రజాస్వామ్యం కంటే నియంతృత్వ వైఖరి పెరిగిందని తెలిపింది. ఆసియాలో అఫ్ఘానిస్థాన్‌, హాంకాంగ్‌, మయన్మార్‌ దేశాల్లో నియంతృత్వం పెచ్చరిల్లినట్టు నివేదిక పేర్కొంది. భారత్‌, శ్రీలంక, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు బలహీనమయ్యాయని వెల్లడించింది. చైనా ప్రభావం పెరగటం వల్ల పలు దేశాల్లో ప్రజాస్వామ్యానికి మద్దతు తగ్గిపోతోందని తెలిపింది. గడచిన దశాబ్ధంలో అమెరికా, పోలండ్‌, స్లోవేనియా, హంగేరీ దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు క్షీణించాయని నివేదిక పేర్కొంది.

Updated Date - 2021-11-23T09:45:19+05:30 IST