ఆ సమయంలో చాలా ఒత్తిడి లోనయ్యా

ABN , First Publish Date - 2021-05-21T09:44:12+05:30 IST

‘మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా జరిగిన ఘటనలతో చాలా వత్తిడికి లోనయ్యా. ఒకానొక సమయంలో రాజీనామా చేద్దామనుకున్నా

ఆ సమయంలో చాలా ఒత్తిడి లోనయ్యా

ఓ దశలో రాజీనామా చేద్దామనుకున్నా!

‘మూడు రాజధానుల’ బిల్లు ఘటనలపై చైర్మన్‌ షరీఫ్‌

ఘనంగా వీడ్కోలు పలికిన మండలి సభ్యులు


అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): ‘మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా జరిగిన ఘటనలతో చాలా వత్తిడికి లోనయ్యా. ఒకానొక సమయంలో రాజీనామా చేద్దామనుకున్నా. సభలో జరిగిన కొన్ని సంఘటనలు బాధ కలిగించాయి. మూడు రాజధానుల సంఘటన జరిగిన తర్వాత జనవరి 26న గవర్నర్‌ ఇచ్చిన విందు కార్యక్రమంలో సీఎం జగన్‌ను కలిసినప్పుడు షరీఫ్‌ అన్నా అని ఆప్యాయంగా పలకరించారు. ఎందుకు కలత చెందారని అడిగారు. ఇంతకుముందు పెద్ద పదవులు చేయలేదని, వత్తిడికి గురయ్యానని చెప్పా. నా నిర్ణయం దైవ కల్పిత నిర్ణయంగా భావించాను. నా పదవీ కాలంలో తప్పులు జరిగితే పెద్ద మనస్సుతో అర్థం చేసుకోవాలి. పదవీ కాలంలో సహరించిన సభ్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు’ అని శాసన మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ అన్నారు. ఈ నెలాఖరుకి శాసన మండలి సభ్యునిగా పదవీ విరమణ చేయనున్న చైర్మన్‌ ఎంఏ షరీ్‌ఫకు గురువారం శాసన మండలి ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ.. తనకు అల్లా దయ వల్ల మండలి చైర్మన్‌ పదవి వచ్చిందని, తన శక్తి సామర్థ్యం వల్ల కాదని నమ్ముతానన్నారు. ‘పదవి కోసం ఎప్పుడు పని చేయలేదు. పదవి అడగలేదు. కార్యకర్త స్థాయి నుంచి అహర్నిశలు పార్టీ కోసమే పని చేశాను. నా కష్టానికి చంద్రబాబు సహకరించారు. పదవి ఇచ్చిన బాబుకు... తనను అన్నగా భావించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు’ అని చెప్పారు.   తొలుత సభ్యులంతా ఆయన చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా ఈ నెలలో పదవీ విరమణ చేస్తున్న సోము వీర్రాజు, గోవిందరెడ్డిలకు కూడా సభ్యులు వీడ్కోలు పలికారు. అనంతరం చైర్మన్‌ చాంబరులో మండలి చైర్మన్‌ షరీ్‌ఫను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి,  ఎమ్మెల్సీలు సన్మానించారు. 


బడ్జెట్‌కు శాసన మండలి ఆమోదం 

రాష్ట్ర బడ్జెట్‌ను శాసనమండలిలో హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టగా, వ్యవసాయ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ప్రవేశ పెట్టారు. సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌లు శాసనమండలి ఆమోదం పొందాయి. తొలుత సభలో ఇటీవల మృతిచెందిన చల్లా రామకృష్ణారెడ్డి, మాజీ సభ్యులు మహ్మద్‌జానీ, బొడ్డు భాస్కరరామారావులకు సభ్యులు సంతాపం తెలిపి, మౌనం పాటించారు. కాగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏడు బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. 

Updated Date - 2021-05-21T09:44:12+05:30 IST