నేను జగన్‌ పాలేరునే!

ABN , First Publish Date - 2021-09-30T08:09:42+05:30 IST

కిరాయికి ఇచ్చేందుకు రాజకీయ పార్టీ పెట్టిన ఘనత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కే దక్కిందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని..

నేను జగన్‌ పాలేరునే!

మరి.. పవన్‌ ఎవరికి పాలేరు?

జనసేన కిరాయికి ఇచ్చే పార్టీ

‘పిచ్చివాగుడు’తో సంబంధం లేదని

పరిశ్రమ పెద్దలు చెప్పారు

చిరంజీవి కూడా విచారం వ్యక్తం చేశారు

మంత్రి పేర్ని నాని వెల్లడి

సినీ ప్రముఖులతో సమావేశం


మచిలీపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):  కిరాయికి ఇచ్చేందుకు రాజకీయ పార్టీ పెట్టిన ఘనత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కే దక్కిందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని విమర్శించారు. కేరవాన్‌లా, షామియానాలా అద్దెకు ఇచ్చే పార్టీని ఆయన ప్రారంభించారని ధ్వజమెత్తారు. ‘పవన్‌ వర్సెస్‌ జగన్‌’ పోరు నేపథ్యంలో... సినీ పరిశ్రమకు చెందిన దిల్‌రాజు, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, సునీల్‌ నారంగ్‌, వంశీ రెడ్డి తదితర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు బుధవారం మచిలీపట్నం వచ్చారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంత్రితో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారంతా మీడియాతో మాట్లాడారు. బుధవారం మంగళగిరిలో జరిగిన  జనసేన సమావేశంలో  ప్రభుత్వంపైనా, తనపైనా పవన్‌   చేసిన వాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. ‘‘నన్ను పవన్‌ పాలేరు అన్నారు.


నేను నిజంగానే ముఖ్యమంత్రి జగన్‌కు పాలేరును. ఈ విషయం షంషేరుగా చెబుతున్నా. మరి... పవన్‌ ఎవరికి పాలేరు? కమ్మవారికి పాలేరువా?’’ అని ప్రశ్నించారు. తనపై నోరు జారితే వెంటనే వాత పెడతానని... అవమానిస్తే తిరిగి అవమానిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఏరా, ఒరేయ్‌ అంటావా? ఇదేనా మీ అమ్మ అంజనాదేవి నీకు నేర్పిన సంస్కారం? పవన్‌ కల్యాణ్‌ను నేను బూతులు తిట్టలేదు కాబట్టే టీవీల్లో బీప్‌లు లేకుండా ప్రసారం చేశారు’’ అని తెలిపారు. ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీరిలీజ్‌ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీ పెద్దలు తనతో మాట్లాడారని చెప్పారు. ఒకరు చేసిన పిచ్చి వాగుడుతో పరిశ్రమకు సంబంధం లేదని స్పష్టం చేశారని తెలిపారు. చిరంజీవి కూడా తనతో ఫోన్‌లో మాట్లాడారని... జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారని తెలిపారు. తాను ఊటీలో షూటింగ్‌లో ఉన్నానని, వచ్చిన తరువాత  ఈ సంఘటనపై స్పందిస్తానని చెప్పారన్నారు. ‘‘సినిమా ఇండస్ర్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏమైౖనా చేస్తుంటే పరిశ్రమ పెద్దలు వచ్చి మాట్లాడవచ్చు. ఎక్కడ లోపం ఉందో  సరిదిద్దుకుంటాం. ఎవరో ఒకరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వాటిని ఖండించాల్సిన బాధ్యత సినీ పెద్దలపై ఉంది’’ అని పేర్ని నాన్ని అన్నారు.


సీఎంకు నివేదిస్తా... 

సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, ఆన్‌లైన్‌ టికెట్ల విధానం, ఇతర అంశాలపై ముఖ్యమంత్రికి నివేదిస్తానని  మంత్రి పేర్ని నాని తెలిపారు. ఒకరి (పవన్‌ కల్యాణ్‌) పిచ్చి వాగుడుతో సినిమా ఇండస్ర్టీకి  ఎలాంటి సంబందం లేదని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు చెప్పారన్నారు. ప్రభుత్వం కూడా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు సీరియస్‌ తీసుకోబోదన్నారు. ఆన్‌లైన్‌ టికెట్ల ప్రతిపాదన నిర్మాతల నుంచే వచ్చిందని తెలిపారు. ఏపీ టెక్నాలజీ  విభాగం ద్వారా ప్రత్యేక యాప్‌ను తయారు చేయించే పనిలో ఉన్నామన్నారు. మనకు సినిమా అంటే పిచ్చి అని, అలాంటి రంగానికి ప్రభుత్వం అన్యాయం చేయదని స్పష్టం చేశారు.


మేమే కోరాం

ఇటీవల జరిగిన సంఘటనతో  సినిమా పరిశ్రమకు ఇబ్బందులు వచ్చాయి. సినిమా ఇండస్ర్టీ సున్నితమైనది. దీనిని రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు. ఆన్‌లైన్‌ టికెట్ల ప్రతిపాదన మేమే తీసుకొచ్చాం. ఇందులో పారదర్శకత పాటించాలని కోరాం.

- దిల్‌ రాజు, నిర్మాత 

నగదు ఆపవద్దని కోరాం

ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు సినిమా ఇండస్ర్టీని ఇబ్బందుల పాలు చేశాయి. ఆన్‌లైన్‌ విధానంలో  టికెట్లు విక్రయిస్తే ప్రభుత్వం వద్ద నగదు ఉండిపోతుందనే భయం సినిమా నిర్మాతల్లో ఉంది. డబ్బులను ఎప్పటికప్పుడు నిర్మాతలకు ఇవ్వాలని కోరాం. నగదు చెల్లింపులు నిలిచిపోతే నిర్మాతలు. పరిశ్రమ ఇబ్బందులు పడుతుంది. కొవిడ్‌ కారణంగా ఏపీలోని సినిమా థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి  ఇస్తున్నారు, దీనిని వందశాతానికి పెంచాలని కోరాం.

- డీవీవీ దానయ్య, నిర్మాత

Updated Date - 2021-09-30T08:09:42+05:30 IST