హాస్టళ్లలో ఆకలి కేకలు

ABN , First Publish Date - 2021-12-08T08:25:54+05:30 IST

హాస్టళ్లలో ఆకలి కేకలు

హాస్టళ్లలో ఆకలి కేకలు

మోడల్‌ స్కూళ్లకు సరుకులు ఆపేసిన కాంట్రాక్టర్లు

ఆరు నెలలుగా బిల్లులు రాక సరఫరా నిలిపివేత

కొన్ని స్కూళ్లలో అప్పుచేసి పెడుతున్న ప్రిన్సిపాళ్లు

ఇక పెట్టలేమని మరికొన్నిచోట్ల నిస్సహాయత

కడపలో తొలిసారి వెలుగులోకి హాస్టళ్ల దుస్థితి

4 నెలలుగా వంట మహిళలకు, హెల్పర్లకు పైసా ఇవ్వని సర్కార్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మోడల్‌ స్కూళ్ల హాస్టళ్లలో ఆకలికేకల దుస్థితి నెలకొంటోంది. ఆరునెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు సరుకుల సరఫరా ఆపేశారు. పిల్లలు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రిన్సిపాళ్లు కొద్దోగొప్పో అప్పు చేసి, అరువు తెచ్చి పిల్లలకు భోజనాలు పెట్టారు. అవీ పేరుకుపోవడంతో ఇక తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. భోజనాలు పెట్టలేం...హాస్టల్‌ మూసేస్తున్నాం అని చెప్పేస్తున్నారు. కడప జిల్లాలోని మోడల్‌ స్కూళ్లలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ జిల్లాలోని సుమారు 9 హాస్టళ్లకు నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టరు సరఫరా ఆపేశారు. మరికొన్ని జిల్లాల్లోని మోడల్‌ స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి! ప్రిన్సిపాళ్లు ఎలాగోలా అప్పు తెచ్చి భోజనం ఏర్పాటుచేస్తే పిల్లలకు ఉన్నట్లు...ఈ అప్పులన్నీ మేమెక్కడ చేస్తాం అని అనుకుంటే ఇక భోజనం పెట్టలేమంటూ చెప్పేసే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో ప్రతిరోజు పెట్టే మఽధ్యాహ్న భోజనం బిల్లులు కూడా 4నెలలుగా విడుదల కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు తెరిచారు. అప్పటినుంచీ ఈ బిల్లులు చెల్లించలేదు. ఈ 4నెలల్లో అవి రూ.500కోట్ల వరకూ పేరుకుపోయాయని సమాచారం. వాస్తవానికి ఈ బిల్లులన్నీ పాఠశాలల్లో వంట చేసే మహిళా సంఘాల సభ్యులకు చెల్లించాల్సి ఉంది. ఒక్కో స్కూలుకు లక్షల్లో బిల్లులు పేరుకుపోవడంతో...ఆ మహిళలు అప్పులు చేసి ఇబ్బందుల్లోకి వెళ్లిపోతున్నారు.


రోజుకు 9.40పైసలు.. అవీ పెండింగ్‌లోనే..

మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం బియ్యం, గుడ్డూ సరఫరా చేస్తుంది. వీటిని వండడంతో పాటు, పప్పు కొనుగోలు చేసి సాంబారు కాయాలి. పప్పు కొనుగోలు, వంటకు కలిపి ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.9.40 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆయా గ్రామాల్లోని స్థానిక మహిళలే ఈ పని చేస్తున్నారు. వీరందరికీ చెల్లించాల్సిన బిల్లులు 4 నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒక పాఠశాలలో 200 మంది పిల్లలున్నారంటే ఒక్కో విద్యార్థికి రూ.9.40 చొప్పున రోజుకు రూ.1880చెల్లించాలి. నెలకు సుమారు రూ.58,400. నాలుగు నెలలంటే రూ.2,33,600. ఇంత మొత్తం పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఈ మహిళలకు లేదు. అయినా ఇప్పుడో, అప్పుడో రాకపోతాయా అని అందినకాడికి అప్పులు చేసి ఏరోజుకారోజు న డిపిస్తున్నారు. నాలుగు నెలల్లో రెండు నెలల బిల్లులకు ఆమోదముద్ర వేసి ఆర్థికశాఖకు పంపామని విద్యాశాఖాఽధికారులు చెబుతున్నారు. కానీ అవీ చేతికందలేదు. దీంతో మధ్యాహ్న భోజనం వండే మహిళలు తలపట్టుకుని కూర్చునే దుస్థితి ఏర్పడింది. వంట చేసే హెల్పర్లకు నెలకు రూ.1500చొప్పున జీతం ఇస్తారు. అదీ నాలుగు నెలల నుంచి చెల్లించలేదు. బిల్లులపై తక్షణం ప్రభుత్వం దృష్టిసారించి విడుదల చేయకుంటే పరిస్థితి అధ్వానంగా తయారవుతుందనే ఆందోళన నెలకొంది. 

Updated Date - 2021-12-08T08:25:54+05:30 IST