ఆ చట్టాలతో వందేళ్లు వెనక్కి: బీవీ రాఘవులు

ABN , First Publish Date - 2021-01-18T08:00:35+05:30 IST

కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే రాష్ట్రం 100 ఏళ్లు వెనక్కు పోయే ప్రమాదం ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.

ఆ చట్టాలతో వందేళ్లు వెనక్కి: బీవీ రాఘవులు

యడ్లపాడు, జనవరి 17: కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే రాష్ట్రం 100 ఏళ్లు వెనక్కు పోయే ప్రమాదం ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా యడ్లపాడులో నూతనంగా నిర్మించిన పోపూరి రామారావు విజ్ఞాన కేంద్రంను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం కొత్త చట్టాలను బలవంతంగా అమలు చేసే దిశగా రాష్ట్రాల్లో రైతులకు రాయితీపై అందించే విద్యుత్‌ను నిలుపుదల చేయాలంటూ ఒత్తిడి తెస్తోందన్నారు.


కులాలు, మతాలంటూ ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. వ్యవసాయంలో రెట్టింపు ఆదాయం వస్తుందంటే గడ్డకట్టే చలిలో నెలల తరబడి రైతులు పోరాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విద్యారంగంలో మన రాష్ట్రం 28వ స్థానంలో ఉందన్నారు. కరోనా పుణ్యమా అని అది మరింతగా పతన దిశగా పయనిస్తోందన్నారు. ‘‘1990 తర్వాత కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకృత విధానాలతో కార్పొరేట్‌ శక్తులు బలపడి లక్షలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడటం విషాదకరం’’అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు.

Updated Date - 2021-01-18T08:00:35+05:30 IST