‘అగ్రి’ బాధితులకు మానవత్వంతో చెల్లింపులు!

ABN , First Publish Date - 2021-08-25T08:49:10+05:30 IST

‘రూపాయి రూపాయి దాచుకుని కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో పేదలు, చేతివృత్తిదారులు, చిరువ్యాపారులు డిపాజిట్‌ చేసిన డబ్బే అగ్రిగోల్డ్‌ డబ్బు. ఒక ప్రైవేటు కంపెనీ మోసం చేసి, ఎగ్గొట్టిన డబ్బును ప్రభుత్వంగా బాధ్యత తీసుకుని, మానవత్వంతో చెల్లిస్తున్నాం’ అని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి

‘అగ్రి’ బాధితులకు మానవత్వంతో చెల్లింపులు!

కేసులు కొలిక్కి రాగానే ఆస్తుల అమ్మకం..

రూ.20 వేలలోపు డిపాజిటర్లకు నగదు జమ

7 లక్షల మంది ఖాతాల్లో 666.84 కోట్లు..

బటన్‌ నొక్కి జమచేసిన సీఎం జగన్‌


అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ‘రూపాయి రూపాయి దాచుకుని కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో పేదలు, చేతివృత్తిదారులు, చిరువ్యాపారులు డిపాజిట్‌ చేసిన డబ్బే అగ్రిగోల్డ్‌ డబ్బు. ఒక ప్రైవేటు కంపెనీ మోసం చేసి, ఎగ్గొట్టిన డబ్బును ప్రభుత్వంగా బాధ్యత తీసుకుని, మానవత్వంతో చెల్లిస్తున్నాం’ అని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఈ కేసులు కోర్టులో కొలిక్కిరాగానే అగ్రిగోల్డ్‌ యజమానుల భూములు, ఆస్తులను అమ్మిస్తామని తెలిపారు. అందులో నుంచి.. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును తీసుకుని, మిగిలిన డబ్బును డిపాజిటర్లకు చెల్లించే దిశగా న్యాయపరంగా ముందడుగు వేస్తామని చెప్పారు. రూ.20 వేల లోపు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేసిన బాధితులు దాదాపు 7 లక్షల మంది ఖాతాల్లో రూ.666.84 కోట్లను ఆయన మంగళవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘హైకోర్టు నిర్దేశించిన విధంగా బాధితులను గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి.. సీఐడీ ద్వారా నిర్ధారించి బాధితులకు ప్రభుత్వం చెల్లింపులు జరుపుతోంది. రూ.20వేల లోపు డిపాజిటర్లకు కనీసం రూ.20 వేలు తిరిగి ఇచ్చేసే కార్యక్రమం ఈ రోజుతో పూర్తి చేస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక 2019 నవంబరులో కోర్టు ఆమోదించిన జాబితా ప్రకారం 3.40 లక్షల మంది రూ.10 వేలలోపు డిపాజిటర్లకు రూ.238.73 కోట్లు చెల్లించాం.


రూ.10 వేల నుంచి రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసి, నష్టపోయిన 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లు ఇస్తున్నాం. అర్హత ఉండి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జాబితాలో మిగిలిపోయిన వారిని కూడా గుర్తించాం. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి, 3.86 లక్షల మందిని గుర్తించి, వారికి మరో రూ.207.61 కోట్లు ఇస్తున్నాం. మొదటి విడత, ఈ విడత కలిపి మొత్తం 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు చెల్లించాం’ అని తెలిపారు. అగ్రిగోల్డ్‌ స్కాంకు గత ప్రభుత్వ హయాంలోని వ్యక్తులే కర్త, కర్మ, క్రియ అని జగన్‌ ఆరోపించారు. డిపాజిట్‌ చేసి మోసపోయిన ్ఞఅందరికీ న్యాయం చేస్తామని చెప్పి, గత ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. ‘రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితుల సంఖ్యను 8.79 లక్షలుగా తేల్చి, వారందరికీ రూ.785 కోట్లు చెల్లించాలని తేల్చి 2019 ఫిబ్రవరి 7న జీవో 31 ఇచ్చింది. కానీ రూపాయి కూడా చెల్లించకుండా వారిని గాలికొదిలేసింది’ అని విమర్శించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, పుష్పశ్రీవాణి, మంత్రులు సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకరనారాయణ, వేణుగోపాలకృష్ణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌, హోం సెక్రటరీ కుమార విశ్వజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-25T08:49:10+05:30 IST