హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు ప్రభుత్వ ఇష్టమే

ABN , First Publish Date - 2021-08-27T09:20:23+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల సంఘం కార్యాలయాన్ని ఫలానాచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు పేర్కొంది.

హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు   ప్రభుత్వ ఇష్టమే

ఫలానాచోట ఏర్పాటు చేయాలని ఆదేశించలేం: హైకోర్టు 

కర్నూలులో కార్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం: ఏజీ

విచారణ నెల రోజులకు వాయిదా 

అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల సంఘం కార్యాలయాన్ని ఫలానాచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు పేర్కొంది. ఎక్కడ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారమేనని తెలిపింది. విచారణను నెల రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. హెచ్చార్సీకి కార్యాలయం ఏర్పాటు చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ... హెచ్‌ఆర్‌సీని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేబినెట్‌ తీర్మానం చేసిందన్నారు. దీనిని అమరావతిలో ఏర్పాటు చేయాలని 2017లో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరిస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. కర్నూలులో కమిషన్‌ కార్యాలయం ఏర్పాటుకు మూడు ప్రాంగణాలు గుర్తించామన్నారు. అందులో రెండు ప్రాంగణాలను పరిశీలించిన చైర్మన్‌, సభ్యులు అనుకూలంగా లేవన్నారని, మరొకటి పరిశీలించాల్సి ఉందన్నారు. కమిషన్‌ ఏర్పాటు పురోగతి తెలిపేందుకు విచారణను నెల రోజులు వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పొత్తూరి సురేశ్‌కుమార్‌ స్పందిస్తూ...హెచ్‌ఆర్‌సీని కర్నూలులో ఏర్పాటు చేస్తే ప్రజలకు చాలా దూరంగా ఉంటుందన్నారు. 

Updated Date - 2021-08-27T09:20:23+05:30 IST