జగన్‌రెడ్డి అసమర్థతకు ఎంత మంది బలి కావాలి?

ABN , First Publish Date - 2021-05-02T08:12:37+05:30 IST

‘‘కర్నూలు, అనంతపురంలో ఆక్సిజన్‌ అందక కరోనా బాధితులు మరణించడం అత్యంత బాధాకరం. ఆక్సిజన్‌ లేక, సొంతం గా సమకూర్చుకుంటున్న బాధితులను చూసైనా జగన్‌ మనసు కరగడం లేదు

జగన్‌రెడ్డి అసమర్థతకు ఎంత మంది బలి కావాలి?

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కేకలు మిన్నంటుతున్నాయి

వ్యాక్సిన్‌ పంపిణీనీ నిర్లక్ష్యం చేస్తున్నారు

వేలల్లో చనిపోతున్నా పట్టించుకోవడం లేదు

శ్మశానాలకు రాజులుగా ఉండదలిచారా?

శవ దహనాలకూ సీరియల్‌ నంబర్లు బాధాకరం

రాష్ట్రంలో మానవత్వం మంటగలిసింది: బాబు

కర్నూలు, అనంత ఘటనలు బాధాకరం

మానవత్వం మంటగలిసింది: చంద్రబాబు


అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి): ‘‘కర్నూలు, అనంతపురంలో ఆక్సిజన్‌ అందక కరోనా బాధితులు మరణించడం అత్యంత బాధాకరం. ఆక్సిజన్‌ లేక, సొంతం గా సమకూర్చుకుంటున్న బాధితులను చూసైనా జగన్‌ మనసు కరగడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కరోనా రోగులకు సరిపడా ఆక్సిజన్‌ను అందుబాటులోకి తేవడంలో ఘోరంగా విఫలమయ్యారు. జగన్‌రెడ్డి అసమర్థతకు ఎంత మంది బలికావాలి?’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఈమేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. మేడే సందర్భంగా కార్మిక నేతలతో జూమ్‌లో మాట్లాడారు. ‘‘ఆక్సిజన్‌ కొరతతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కేకలు మిన్నంటుతున్నాయి. ఆక్సిజన్‌ నిల్వలపై ప్రభుత్వ లెక్కలకు, వాస్తవాలకు పొంతన ఉండటం లేదు. బెడ్లు, ఆక్సిజన్‌ కొరతతో కరోనా రోగులు ప్రాణాలు విడుస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్ర వీడాలి. ఆక్సిజన్‌ కొరత నివారణకు చర్యలు తీసుకుని, రోగుల ప్రాణాలు కాపాడాలి. సదుపాయాలున్న ప్రతి ప్రైవేటు ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలి’’ అని చంద్రబాబు కోరారు. కరోనాతో చనిపోతున్న ప్రతి మరణం ప్రభుత్వ హత్యగా పరిగణించాలని అన్నారు. 


మనుషులు చనిపోతే కూడా పట్టించుకోని, ఈ ప్రభుత్వాధినేతలు శ్మశానాలకు రాజులుగా ఉండదలిచారా? అని నిలదీశారు. ‘‘కరోనాను నివారించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం వ్యాక్సిన్‌ పంపిణీని నిర్లక్ష్యం చేస్తోంది. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌... డాక్టర్లు, నర్సులను కాపాడుకోలేని పరిస్థితిని చూస్తుంటే బాధేస్తోంది. శవాలను తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు కూడా రావడం లేదు. మృతులను ఆటోల్లో, స్కూటర్లపై తరలించే దృశ్యాలు చూస్తుంటే, మనస్సుకు బాధేస్తోంది. శ్మశానాల్లో శవాలను కాల్చేందుకు సీరియల్‌ నంబరు ఇస్తున్న తీరు బాధాకరం. రాష్ట్రంలో మానవత్వం మంటకలిసి పోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా కరోనా కట్టడికి ఒక వెబ్‌సైట్‌ను తయారు చేసి, అవసరమైన మందులను కొనుగోలు చేసి, పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కరోనాపై ఎవరైనా మాట్లాడితే ఎదురు దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇంతటి భయంకర పరిస్థితుల్లో కూడా తప్పుడు కేసులు పెట్టి, సీబీసీఐడీ విచారణతో నాయకుల్ని వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.  

Updated Date - 2021-05-02T08:12:37+05:30 IST