గృహ విద్యుత్ వాడకం పైపైకి
ABN , First Publish Date - 2021-05-08T08:55:12+05:30 IST
రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనల వల్ల గృహ విద్యుత్ వాడకం పెరుగుతోంది. దీనితో విద్యుత్ సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. కర్ఫ్యూ వల్ల జనం ఇళ్లకే పరిమితమవడంతో రెండు రోజులుగా గృహ విద్యుత్ వాడకంలో పెరుగుదల

కర్ఫ్యూలో జనం ఇళ్లకే పరిమితమైన ఫలితం
లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరుపై రోజువారీ పర్యవేక్షణ
ప్రతి డిస్కంకు ఒక నోడల్ అధికారి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనల వల్ల గృహ విద్యుత్ వాడకం పెరుగుతోంది. దీనితో విద్యుత్ సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. కర్ఫ్యూ వల్ల జనం ఇళ్లకే పరిమితమవడంతో రెండు రోజులుగా గృహ విద్యుత్ వాడకంలో పెరుగుదల కనిపిస్తోందని విద్యుత్ వర్గాలు తెలిపాయి. గతేడాది ఏప్రిల్లో కరోనా కారణంగా పూర్తి స్థాయు లాక్డౌన్ అమలైంది. అప్పుడు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో రోజువారీ విద్యుత్ వినియోగం 156 మిలియన్ యూనిట్లు ఉంది. ఇప్పుడు లాక్డౌన్ తరహా ఆంక్షలు లేవు. షాపులను మాత్రం మూయిస్తున్నారు. పరిశ్రమలు యథావిధిగానే పనిచేస్తున్నాయి. దీనికి గృహ విద్యుత్ వాడకంలో పెరుగుదల తోడు కావడంతో ఈ ఏడాది ఏప్రిల్లో రోజువారీ వాడకం 209 మిలియన్ యూనిట్లకు పెరిగింది. మే నెలలో అది మరింత 211 మిలియన్ యూనిట్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెలలో లాక్డౌన్ విధించాల్సి వస్తే మాత్రం విద్యుత్ వాడకం పడిపోయే అవకాశం ఉంది. వేసవి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని విద్యుత్ సంస్థలు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు తదితరాలపై రోజువారీ పర్యవేక్షణను పెంచాయి.
అవసరమైన చోట మరమ్మతులు కూడా తక్షణం చేపట్టాలని ఆదేశించారు. పట్టణాలు, గ్రామాల్లో కూడా విద్యుత్ అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ సంస్థల అధికారులను మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. రాబోయే వర్షాకాలానికి కూడా ఇప్పటి నుంచే సన్నద్ధత చూపాలని ఆయన సూచించారు. గోదావరి వరదల సమయంలో డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకోవడం మంచి ఫలితాలను ఇచ్చిందని, ఈసారి కూడా అటువంటి టెక్నాలజీలను సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. కరోనా చికిత్సల సమయంలో విద్యుత్ సరఫరా అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యమ్నాయ ప్రణాళికలను కూడా రూపొందించుకొన్నామని, ఎక్కడైనా ఒక లైన్లో కరెంటు పోతే మరో లైన్ ద్వారా కరెంటు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామని ట్రాన్స్కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. సరఫరా సమస్యలపై మరింత దృష్టి కేంద్రీకరించడానికి ప్రతి డిస్కం సంస్థకు ఒక నోడల్ అధికారిని పెట్టినట్లు చెప్పారు. సరాసరి అంతరాయాల సమస్య రెండు ఆర్థిక సంవత్సరాల కిందట ఎనిమిది గంటలు ఉంటే, దానిని ఇప్పుడు ఆరు గంటలకు తగ్గించగలిగామని, ఫ్రీక్వెన్సీ అంతరాయాలను కూడా 19 శాతం తగ్గించామని వివరించారు. సిబ్బంది పనితీరును మెరుగుపర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.