హిందూ సంప్రదాయమా.. అయితే ఏంటి?

ABN , First Publish Date - 2021-11-09T07:39:53+05:30 IST

అదో ఉమ్మడి కుటుంబం. తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. తండ్రి ఉమ్మడి ఆస్తులను పంచాలని నిర్ణయించుకున్నారు.

హిందూ సంప్రదాయమా.. అయితే ఏంటి?

వారసత్వ ఆస్తుల పంపకంపై సర్కారు తీరిది

రివాజులను కాదని రిజిస్ట్రేషన్ చార్జీల మోత

ఉమ్మడిగా కొన్నా సౌలభ్యం కోసం పంపకాలు

వాటినీ స్వీయార్జితాలుగా చూస్తున్న ప్రభుత్వం

ఆ ఆస్తుల రిజిస్ట్రేషన్ పై 3% అదనపు వడ్డన


అమరావతి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): అదో ఉమ్మడి కుటుంబం. తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. తండ్రి ఉమ్మడి ఆస్తులను పంచాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే కుమార్తెకు ఇవ్వాల్సినవి ఇచ్చి పెళ్లి చేసి పంపించడం, చిన్నకుమారుడు ఎక్కడో ఉద్యోగం చేస్తుండటంతో.. ఆస్తుల్లో సింహభాగం పెద్దకుమారుడికి ఇచ్చి ఆయన దగ్గరే శేషజీవితం గడపాలని వారు భావించారు. ఈ మేరకు పెద్దోడికి 60శాతం, చిన్నోడికి 40శాతం ఆస్తుల్లో వాటా వేశారు. అమ్మాయికి పెళ్లి సమయంలోనే ఇచ్చినా...ఆమె సంతకాలు కూడా ఆస్తుల పంపకాలకు కావాలి కాబట్టి ఆమెకు కొంత నగదు ఇస్తున్నట్లు చూపించారు. ఇలా చేసినప్పుడు భాగస్వామ్య రిజిస్ట్రేషన్లో పెద్ద వాటాకు  రిజిస్ట్రేషన్ చార్జీ నుంచి మినహాయింపు ఉంటుంది. కేవలం 40శాతానికి మాత్రమే కట్టాల్సి ఉంటుంది. అయితే, రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వారికి సబ్‌ రిజిస్ర్టార్‌ మాటలు మింగుడు పడలేదు. ‘‘ఇప్పుడు చట్టం మారింది. మీకు ముగ్గురు పిల్లలుంటే మూడు సమాన వాటాలు. అంటే అందరికీ తలో 33.33శాతం. ఆ 33.33శాతం పోను మీ పెద్దకుమారుడి వాటా కిందకు వచ్చే మిగతా 26.66శాతానికి రిజిస్ట్రేషన్ పన్ను చెల్లించాల్సిందే’’ అని తేల్చి చెప్పారు. హిందూ కుటుంబాల్లో ఆస్తి పంపకాల విషయంలో ఉన్న సంప్రదాయాలను దెబ్బతీసేలా రిజిస్ర్టేషన్‌ పన్నుల విషయంలో ఇలాంటి మార్పులు తెచ్చారనే విమర్శలు వస్తున్నాయి.


హిందూ వారసత్వ చట్టం ఎలా ఉన్నా...అనాదిగా కొన్ని సంప్రదాయాలు నెలకుని ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులు అన్నీ దృష్టిలో పెట్టుకునే చేస్తారు. కుమార్తెలకు ముందే సెటిల్‌ చేసి పంపిస్తారు. అమ్మాయిలపై ప్రేమతో ఉన్నదానిలో ముందు వారికిచ్చి పెళ్లి చేయాలని చూస్తారు. ఆ తర్వాత మిగిలింది కుమారులకు పంచుతారు. అదే సమయంలో కుమారుల మధ్య కూడా అంతకుముందే ఏమైనా లావాదేవీలు, ఖర్చులు, వాడకాలు ఉంటే వాటన్నింటినీ లెక్కలోకి తీసుకుని ఆస్తుల పంపకం చేసి, భాగ పరిష్కార రిజిస్ర్టేషన్‌ చేయించేవారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయాలను ప్రభుత్వం పక్కనపెట్టేసిందనే విమర్శలు వస్తున్నాయి. కేవలం చట్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని...కుటుంబంలో ముగ్గురుంటే...ముగ్గురికీ సమాన వాటాలు వేసి...అందులో ఒక వాటాకు మాత్రమే రిజిస్ర్టేషన్‌ చార్జీ నుంచి మినహాయింపు ఇస్తామంటూ కొన్నిరోజుల క్రితం ఉత్తర్వులిచ్చారు. దీని ప్రకారం.. ఉమ్మడి ఆస్తుల పంపకాలపై జరిగే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పెద్ద వాటాను కాకుండా, ఒక సమాన వాటాను మాత్రం మినహాయించి మిగిలిన సమ వాటాలపై ఒకశాతం చార్జీ వసూలు చేస్తారు. పెద్ద వాటాలో సమ వాటా ఎంతుందో అంత మినహాయించి...అందులో మిగిలిన భాగానికి మూడుశాతం చార్జీలు కట్టించుకుంటారు. ఇది రిజిస్ర్టేషన్‌ చేయించుకునేవారిపై భారం పెంచుతోందనే ఆందోళన నెలకుంది. 


ఉమ్మడిగానే కొన్నా.. 

రిజిస్ర్టేషన్‌ చార్జీల తగ్గింపు ఉంటుందనే ఉద్దేశంతో స్వీయార్జిత ఆస్తులను కూడా ఉమ్మడి ఆస్తుల పంపకాల్లో కలిపేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఈ ఆస్తులను ఉమ్మడి ఆస్తుల పంపకం రిజిస్ర్టేషన్‌ పత్రంలో కలిపినా...వాటి వరకు మాత్రం నాలుగు శాతం రిజిస్ర్టేషన్‌ చార్జీలు వసూలుచేయాలని ఆదేశించింది. అయితే ఇది కూడా ధర్మం కాదనే అభిప్రాయం నెలకొంది. ఎందుకంటే సాధారణంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు, పదేళ్లకాలంలోనూ, లేకుంటే 20ఏళ్ల కాలంలోనూ కొన్ని ఆస్తులు కొంటారు. అయితే కొనుగోలు చేసిన ప్రతి ఆస్తినీ తల్లితండ్రులు తమ పేర్లమీద పెట్టుకోరు. అలాగని అంతా కలిసి ఉమ్మడిగానూ రిజిస్ర్టేషన్‌ చేయించుకోరు. సౌలభ్యం కోసం, అంతా తిరగాల్సిన పని లేకుండా చేసుకునేందుకు, లేకుంటే ఎందుకైనా మంచిదని ఒక్కో ఆస్తిని తమ ఉమ్మడి కుటుంబంలోని ఒక్కొక్కరి పేరుతో కొనుగోలు చేస్తారు. వాటికి 7.5శాతం రిజిస్ర్టేషన్‌ చార్జీలు చెల్లించి రిజిస్ర్టేషన్‌ చేసుకుంటారు. అయితే ఆ ఆస్తులన్నీ ఉమ్మడి కుటుంబం సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసినవే. వీటిని కూడా ఆ తర్వాత పంపకాల సమయంలో కలిపేసి అందరూ వారి ఒప్పందం మేర రిజిస్ర్టేషన్‌ చేయించుకుంటారు. కానీ ఇప్పుడు అలా ఒక్కొక్కరి పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తులేమైనా ఉంటే...వాటిపై ఒక్క శాతం కాకుండా నాలుగుశాతం పన్ను కట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అంటే ఏకంగా మూడుశాతం ఫీజు పెంచేశారు. ఇది కూడా హిందూ సంప్రదాయాలు, వారి పద్ధతులకు విలువ ఇవ్వకుండా...ప్రభుత్వానికి ఎంత  విలువపై పన్ను కట్టించుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి అన్నదానిపైనే దృష్టిపెట్టడమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-11-09T07:39:53+05:30 IST