నివాసంలో దీక్షకు దిగిన దేవినేని.. మద్దతు తెలిపిన దూళిపాళ్ల నరేంద్ర
ABN , First Publish Date - 2021-01-20T16:14:19+05:30 IST
దేవినేని ఉమ తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు దూళిపాళ్ల నరేంద్ర మద్దతు తెలిపారు.

గొల్లపూడి (విజయవాడ): అమరావతి ఉద్యమం 400వ రోజులకు చేరుకున్న నేపథ్యంలో టీడీపీ దీక్షకు పిలుపు నిచ్చింది. దీంతో గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టాలని దేవినేని ఉమా నిర్ణయించారు. అయితే అక్కడ దీక్షకు పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో తన నివాసంలో దీక్ష చేపట్టారు. దేవినేని దీక్షకు టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అమరావతి ఉద్యమం 400వ రోజులకు చేరుకోవడంతో రైతులకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ దీక్షలకు పిలుపు ఇచ్చిందన్నారు. రాజధాని కోసం సుమారు 117 మంది రైతులు చనిపోయారని, ఏపీ రాజధాని కోసం 34వేల ఎకరాల భూములు ఇచ్చారని, 29వేల రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ తాము బహిరంగ ప్రదేశాల్లో దీక్షలు చేయడంలేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా ప్రైవేటు స్థలాల్లో నిరసనలు చేయడానికి కూడా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. తమ సొంత స్థలాల్లో నిరసనలు తెలుపుతే అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. సొంత స్థలంలో కూర్చుని నిరసన తెలియజేయడానికి ప్రభుత్వం అనుమతి అవసరం లేదని, తమకు మైక్‌లు కూడా వద్దని అన్నారు. మంత్రులు వందలమంది కార్యకర్తలతో వచ్చి ఇళ్లపట్టాల పంపిణీ చేస్తుండగా వారికి కోవిడ్ నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు. నిబంధనలు ఎవరికైనా ఒకటేనని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం ప్రకారం పోలీసులు పనిచేయాలని దూళిపాళ్ల అన్నారు.
గొల్లపూడిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి ఉద్యమం 400వ రోజులకు చేరుకున్న నేపథ్యంలో టీడీపీ దీక్షకు పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో గొల్లపూడి వన్ సెంటర్ పోలీసుల వలయంలో ఉంది. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ నివాసం సమీపంలోని ఉండేవారు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గొల్లపూడి ప్రాంతం మొత్తం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. పోలీస్ ఆంక్షలతో దేవినేని ఉమ తన నివాసంలో దీక్ష చేపట్టారు.