కొత్త విధానం తెచ్చేటప్పుడు చట్టనిబంధనలు పాటించాలి కదా?

ABN , First Publish Date - 2021-08-20T08:26:22+05:30 IST

ఇంటర్‌ ప్రవేశాలు ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టాలని ఇంటర్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.

కొత్త విధానం తెచ్చేటప్పుడు చట్టనిబంధనలు పాటించాలి కదా?

ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లపై  ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న 

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ప్రవేశాలు ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టాలని ఇంటర్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ... ఆన్‌లైన్‌ ప్రవేశాల విషయంలో ఎలాంటి నిబంధనలు రూపొందించలేదన్నారు. కేవలం ఒక ప్రెస్‌నోట్‌ ద్వారా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించిందన్నారు. ఏపీఓఏఎ్‌సఐఎస్‌ విధానం ఏపీ ఇంటర్మీడియట్‌ చట్టం, ఏపీ విద్యాసంస్థల చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. కళాశాల యాజమాన్యాలతో సంప్రదించకుండా ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఇంటర్‌ ప్రవేశాలు కల్పించాలని ఇంటర్‌బోర్డు ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే స్పందిస్తూ... 5.5 లక్షల మంది విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ... కొత్త విధానం తీసుకొచ్చే సమయంలో చట్ట నిబంధనలు పాటించాలి కదా? అని ప్రశ్నించారు. కౌంటర్‌ దాఖలుకు అనుమతిస్తూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య గురువారం ఆదేశాలిచ్చారు. ఇంటర్‌ ప్రవేశాలు ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టాలన్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సెంట్రల్‌ ఆంధ్రా జూనియర్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. మరోవైపు ఇదే వ్యవహారంపై టెన్త్‌ పూర్తిచేసిన 500మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2021-08-20T08:26:22+05:30 IST