‘మూడు’ పగలకముందే జగన్‌ సర్కారు ముందు జాగ్రత్త

ABN , First Publish Date - 2021-11-23T08:39:05+05:30 IST

‘ఏ క్షణమైనా విశాఖకు రాజధాని! మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదు. ఇది ఎడారి... శ్మశానం!’ అంటూ అమరావతిపై బురదచల్లుతూ వచ్చిన ప్రభుత్వం హఠాత్తుగా అడుగు వెనక్కి వేసింది. ‘శుభం కార్డు కాదు’ అంటూనే... మూడు రాజధానుల..

‘మూడు’ పగలకముందే జగన్‌ సర్కారు ముందు జాగ్రత్త

  • ముప్పేట దాడితో ఉక్కిరి బిక్కిరి
  • హైకోర్టులో ‘కొట్టివేత’ గండం
  • రాజధానిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
  • అమరావతికి అన్ని ప్రాంతాల మద్దతు
  • పాదయాత్రకు ప్రజల సంఘీభావం
  • అమరావతికి మద్దతుగా అమిత్‌షా
  • ఇన్ని కారణాలవల్లే ‘3’పై వెనక్కి
  • ఇది వ్యూహాత్మక వెనుకడుగే!
  • అదును చూసి మళ్లీ ముందుకే!


‘తగ్గేదేలేదు’ అంటున్న సర్కారు... మూడు రాజధానులపై ఉన్నట్టుండి వెనక్కి తగ్గింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టాల్లో  లోపాలున్నాయని ఇప్పుడు గుర్తుకొచ్చింది. వాటిని సరిదిద్ది... మరింత పకడ్బందీగా త్వరలోనే మూడు రాజధానులతో ముందుకు వస్తామని తెలిపింది. పాత చట్టాలు చేసి ఇప్పటికి దాదాపు రెండేళ్లు గడిచిపోయాయి. ‘త్వరలో’ అంటున్న కొత్త బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియదు! అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు! కోర్టు కేసుల్లో వాదనలకు కోట్లు కుమ్మరించి, రెండేళ్ల కాలాన్ని హరించి ఇప్పటిదాకా సాధించిందేమిటో తెలియదు! ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్రం మరింత అనిశ్చితిలోకి జారుకుందని విపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇది ‘ఇంటర్వెల్‌’ మాత్రమే అంటున్నారు. మరి.. క్లైమాక్స్‌లో శుభం కార్డు ఎలా, ఎవరికి పడుతుందో!? 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఏ క్షణమైనా విశాఖకు రాజధాని! మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదు. ఇది ఎడారి... శ్మశానం!’ అంటూ అమరావతిపై బురదచల్లుతూ వచ్చిన ప్రభుత్వం హఠాత్తుగా అడుగు వెనక్కి వేసింది. ‘శుభం కార్డు కాదు’ అంటూనే... మూడు రాజధానుల ముచ్చటకు ప్రస్తుతానికి తెరదించింది. ఈ అనూహ్య నిర్ణయానికి కారణం ఏమిటి? ‘మూడు’పై మాడు పగిలే అవకాశముందనే వ్యూహాత్మకంగా వెనుకడుగు వేశారా? తర్వాత ‘ఎలా’ ముందుకు వస్తారు? అనే అంశంపై రకరకాల చర్చ జరుగుతోంది. రైతుల ఉద్యమం, హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలే అవకాశం, ‘ఢిల్లీ ఒత్తిడి’... ఈ మూడు కారణాలవల్లే జగన్‌ సర్కారు అడుగు వెనక్కి వేసినట్లు తెలుస్తోంది. 


హైకోర్టులో వాదనల వాడి

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులతోపాటు పలువురు కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా ప్రభుత్వ ‘మూడు రాజధానుల’ నిర్ణయంపై ధర్మాసనం సునిశిత వ్యాఖ్యలు చేస్తోంది. ‘‘హైకోర్టు లేకుండా న్యాయరాజధాని ఎలా? కేంద్రం నోటిఫికేషన్‌ లేకుండా హైకోర్టును కదిలించగలరా? ఇది ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉంది. పాలనా వికేంద్రీకరణ చట్టంలోనే స్పష్టత లేదు. భారతదేశం మొత్తం దేశ ప్రజలందరిదీ. అలాగే... అమరావతి కేవలం భూములు ఇచ్చిన రైతులకే పరిమితం కాదు. అది... విశాఖపట్నం, కర్నూలు, రాష్ట్రప్రజలందరికీ చెందుతుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు చట్టాల చట్టబద్ధతను పరిశీలిస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అటువైపు... అమరావతికి అనుకూలంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపిస్తున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే... పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు), సీఆర్డీఏ రద్దు చట్టాలు న్యాయ సమీక్షకు నిలవకపోవచ్చునని ప్రభుత్వానికీ అర్థమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వ్యూహాత్మకంగా 3రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నట్లు భావిస్తున్నారు.


రైతుల ఉద్యమ వేడి

‘అమరావతే ఏకైక రాజధాని’ నినాదంతో రైతులు చేస్తున్న ఉద్యమం 700 రోజులు దాటింది. ఇది కేవలం ఆ ప్రాంతంలో కొంతమందికి పరిమితమైన ఉద్యమమని ప్రభుత్వ పెద్దలు చెబుతూ వచ్చారు. ఈ అభిప్రాయం తప్పని రాజధాని రైతుల ‘న్యాయస్థానం టు దేవస్థానం’ మహా పాదయాత్రతో స్పష్టమైంది. దీనిపై ప్రకాశం జిల్లాలో పోలీసులు చేపట్టిన అతి కట్టడి చర్యలను సామాన్య ప్రజలు కూడా నిరసించారు. రైతుల యాత్రకు ప్రజల నుంచి ప్రభుత్వ వర్గాల్లో సైతం ఊహించని ప్రతిస్పందన కనిపిస్తోంది. ఇది మరింత బలపడితే కష్టమనే ఆందోళన జగన్‌ సర్కారులో మొదలైందని.. ఈ నేపథ్యంలో... తాత్కాలికంగానైనా ఉద్యమాన్ని చల్లార్చేందుకు మూడు రాజధానుల బిల్లును రద్దు చేసి ఉండొచ్చుననే అభిప్రాయం కలుగుతోంది.


‘కమలం’ పెద్దల దాడి

అమరావతికి మద్దతు విషయంలో బీజేపీ పూర్తి స్పష్టతనిచ్చింది. అంతకుమునుపు ‘తలో దారి’లా ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల తిరుపతిలో క్లాస్‌ పీకారు. అమరావతి ఉద్యమానికి ఎందుకు మద్దతు పలకడంలేదని ప్రశ్నించారు.  సొంత అజెండాలు పక్కనపెట్టి, కలిసికట్టుగా అమరావతికి సంఘీభావం ప్రకటించాల్సిందేనని తేల్చిచెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాతే... రాష్ట్ర బీజేపీ నేతలు రైతుల పాదయాత్రలో పాల్గొనడం, ఉద్యమానికి మద్దతుగా స్పష్టమైన ప్రకటనలు చేయడం మొదలైంది. అనేక మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకుని, రాష్ట్రంలో పరిస్థితులను స్వయంగా పరిశీలించాకే అమిత్‌షా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. రాజధాని రైతులకు అండగా నిలవాలని నిర్దేశించారు. ఈ పరిణామం జగన్‌ సర్కారుకు మింగుడు పడలేదని తెలుస్తోంది. ప్రస్తుత నిర్ణయానికి ఇది కూడా ఓ కారణమని చెబుతున్నారు.


‘వెనుకడుగు’ వ్యూహాత్మకమేనా?

‘ఇది సర్కారు తాత్కాలికంగా, వ్యూహాత్మకంగా వేసిన వెనుకడుగు మాత్రమే. మూడు రాజధానుల కత్తి వేలాడుతూనే ఉంది’ అని జగన్‌ వైఖరి తెలిసిన వారు చెబుతున్నారు. న్యాయ సమీక్షలో దొరికిపోయే ప్రమాదం ఉన్నందునే... వెనుకడుగు వేశారని, దాన్ని మరింత పకడ్బందీగా తీసుకొచ్చే ఉద్దేశ్యంతోనే వ్యూహాత్మకంగా పాత చట్టాలను రద్దుచేశారని జగన్‌ అనుకూలవర్గాలు చెబుతున్నాయి. మరింత సమగ్రంగా కొత్త బిల్లు తీసుకొస్తామని సభలోనే జగన్‌ ప్రకటించారు. ఇది ఇంటర్వెల్‌ మాత్రమే అని, శుభం కార్డు పడటానికి చాలా సమయం ఉందని సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దీన్ని బట్టిచూస్తే...  ఎడాపెడా తగులుతున్న ఎదురుదెబ్బల నుంచి తాత్కాలిక ఉపశమనం కోసమే ఈ చట్టాలను ఉపసంహరించుకున్నారని, అదునుచూసి... తనకు అనుకూల వాతావరణం ఉందనుకున్నప్పుడు మళ్లీ తెరపైకి తెస్తారని చెబుతున్నారు.

Updated Date - 2021-11-23T08:39:05+05:30 IST