పింక్‌ డైమండ్‌పై మళ్లీ విచారణ అక్కర్లేదు: హైకోర్టు

ABN , First Publish Date - 2021-02-05T08:38:03+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టీటీడీ) చెందిన పింక్‌ డైమండ్‌ విషయంలో మళ్లీ విచారణ జరిపించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

పింక్‌ డైమండ్‌పై మళ్లీ విచారణ అక్కర్లేదు: హైకోర్టు

అమరావతి, ఫిబ్రవరి4 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టీటీడీ) చెందిన పింక్‌ డైమండ్‌ విషయంలో మళ్లీ విచారణ జరిపించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ డైమండ్‌ అసలు ఉందా.. లేదా.. మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన పింక్‌ డైమండ్‌, జెనీవాలో వేలం వేసిన పింక్‌ డైమండ్‌ ఒకటో కాదో తేల్చేందుకు విచారణ జరపాలని కోరుతూ టీడీపీ అధికార ప్రతినిధి వై. విద్యాసాగర్‌ పిల్‌ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్‌ డీపీ వాద్వా నేతృత్వంలోని కమిటీ పింక్‌ డైమండ్‌కు సంబంధించి వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నివేదిక ఇచ్చిందని.. మరో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.జగనాథరావు నేతృత్వంలోని కమిటీ 1952 నుంచి ఇప్పటివరకు టీటీడీ రికార్డులో పింక్‌ డైమండ్‌ ప్రస్తావనే లేదని పేర్కొందని కోర్టు తెలిపింది. ఈ కమిటీల నివేదికలు పరిశీలించాక ఈ వ్యవహారంపై మరోసారి విచారణకు ఆదేశించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెల్లడించింది. 

Updated Date - 2021-02-05T08:38:03+05:30 IST