ఏమిటీ ధిక్కారం!

ABN , First Publish Date - 2021-05-20T08:22:36+05:30 IST

న్యాయస్థానాల తీర్పులను పట్టించుకోకుండా ‘ఇష్టారాజ్యం’గా వ్యవహరించడంపై హైకోర్టు మండిపడింది. సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌ కుమార్‌, మంగళగిరి సీఐడీ

ఏమిటీ ధిక్కారం!

సీఐడీ చీఫ్‌పై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం

కోర్టు ధిక్కరణ కింద చర్యలు, నోటీసులు జారీ

రఘురామపై కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదేం?

ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి ఎందుకు తరలించలేదు?

సర్కారుకు ధర్మాసనం సూటి ప్రశ్నలు

మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు చట్ట విరుద్ధమన్న ఏఏజీ

హైకోర్టు ఉత్తర్వులు రాత్రి అందాయని వెల్లడి

ఏఏజీ వాదనలపై హైకోర్టు అభ్యంతరం

ఉత్తర్వులపై అప్పీలుకు ఎందుకు వెళ్లలేదు?

మరుసటిరోజైనా ఎందుకు అమలు చేయలేదు?

చెప్పింది చాలు... అంటూ తీవ్ర అసంతృప్తి

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కూ నోటీసులు 


‘‘ఎంపీ రఘురామ కృష్ణంరాజును రమేశ్‌ హాస్పిటల్‌కు తరలించాలని ఇచ్చిన ఉత్తర్వులు రాత్రి 11 గంటలకు అందాయి. రాత్రివేళ జైలు తలుపులు తెరవలేం. అందుకే ఉత్తర్వుల అమలు సాధ్యం కాలేదు. ఆ మరుసటిరోజు, అంటే 17వ తేదీన ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది’’

అదనపు అడ్వకేట్‌ జనరల్‌


‘‘మా ఆదేశాలు 16వ తేదీ రాత్రి అమలు చేయలేకపోతే... మరుసటి రోజైనా ఎందుకు అమలు చేయలేదు. 17వతేదీ మధ్యాహ్నం 1.30 గంటల కు సుప్రీంకోర్టు తీర్పు వచ్చేలోపు ఎంపీని ఆస్పత్రికి ఎందుకు తరలించలేదు?’’

హైకోర్టు ధర్మాసనం


అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానాల తీర్పులను పట్టించుకోకుండా ‘ఇష్టారాజ్యం’గా వ్యవహరించడంపై హైకోర్టు మండిపడింది. సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌ కుమార్‌, మంగళగిరి సీఐడీ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. ఎంపీ రఘురామరాజుకు గుంటూరు రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స అందించాలన్న కోర్టు ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి... వారికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అని తేల్చి చెప్పింది. మరోవైపు, ఎంపీ రఘురామకు ఈ నెల 15న మధ్యాహ్నం 2గంటలకే వైద్యపరీక్షలు ముగిసినా... సాయంత్రం 6.30కు నివేదిక ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని మెడికల్‌ బోర్డు చైర్మన్‌, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.


జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఉత్తర్వులు వెలువరించింది. సీఐడీ పోలీసు కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామరాజును శనివారం గుంటూరులోని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చేందుకు తీసుకెళ్లినప్పుడు.. కస్టడీలో తనను కర్రలు, ఫైబర్‌ లాఠీలతో కొట్టారని కోర్టుకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇదే అంశాన్ని రఘురామ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  ఆయన్ను రమేశ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని తొలుత మేజిస్ట్రేట్‌ కోర్టు... తర్వాత హైకోర్టు ఆదేశించినా సీఐడీ అధికారులు పట్టించుకోలేదు. జైలుకే తరలించారు. బుధవారం హైకోర్టులో ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ‘ఎంపీకి రమేశ్‌ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఆదేశాలను తక్షణం అమలు చేయాలని మేమిచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు’’ అని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది.


మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని... ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించే అధికారం మేజిస్ట్రేట్‌కు లేదని ఆయన బదులిచ్చారు. ‘‘ఉత్తర్వులపై అభ్యంతరముంటే పైకోర్టులో అప్పీల్‌ చేసుకోవాలి. తక్షణం మా ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించాం. అయినప్పటికీ ఎందుకు చేయలేదు’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను  హైకోర్టులో సవాల్‌ చేశామని ఏఏజీ తెలిపారు. ‘ఎంపీని రమేశ్‌ హాస్పిటల్‌కు తరలించాలని ఇచ్చిన ఉత్తర్వులు రాత్రి 11 గంటలకు అందాయి. రాత్రివేళ జైలు తలుపులు తెరవలేం. ఆ మరుసటిరోజు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది’’ అని వివరించారు. ఈ వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంపీని ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు 17వ తేదీ మధ్యాహ్నం 1.30కి ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేసింది. ‘‘మ ఆదేశాలు 16వ తేదీ రాత్రి అమలు చేయలేకపోతే... 17న సుప్రీం తీర్పు వచ్చేలోపు ఎంపీని ఆస్పత్రికి ఎందుకు తరలించలేదు’’ అని నిలదీసింది. కోర్టు ఆదేశాలను పాటించని అధికారులపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.ఆదేశాలు ఎందుకు అమలు చేయలేకపోయారో పూర్తి వివరాలను అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని ఆదేశించింది. ఉత్తర్వులు చట్టవిరుద్ధమైతే అప్పీల్‌ చేసుకోవాలని.. అంతేతప్ప, ఆదేశాలు తప్పని చెప్పే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసింది.


ఏఏజీ స్వరం పెంచారంటూ ఆగ్రహం

మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల అమలు కోసం హైకోర్టును వేదిక చేసుకోవడం సరికాదని ఏఏజీ పేర్కొన్నారు. ‘ఈ కేసు ఎవరికీ ప్రత్యేకం కాకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వాదనలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలా మాట్లాడవద్దని... నియంత్రణలో ఉండాలని సూచించింది.. ‘‘కోర్టు ఆఫీసర్‌గా మీరేమనుకుంటున్నారు? చెప్పింది చాలు’’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించినందుకు... ఏఏజీ తన స్వరం పెంచి వాదనలు వినిపించడాన్ని ధర్మాసనం ఉత్తర్వుల్లో నమోదు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛముడిపడి ఉన్న అంశాల్లో కోర్టు ఉత్తర్వులు తక్షణం అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తేల్చిచెప్పింది.  ఎంపీ తరఫున న్యాయవాది దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపించారు.

Updated Date - 2021-05-20T08:22:36+05:30 IST