కోస్తా, సీమలకు.. వాయు‘గండం’

ABN , First Publish Date - 2021-11-09T07:23:28+05:30 IST

ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది.

కోస్తా, సీమలకు.. వాయు‘గండం’

ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం 

రేపటి నుంచి కోస్తా, సీమ జిల్లాలకు భారీ వర్షసూచన

విశాఖపట్నం/అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 48 గంటల్లో మరింత బలపడి ఈ నెల 11వ తేదీ ఉదయానికి వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు తీరం దిశగా ప్రయాణించనుంది. దీంతో రానున్న రెండు మూడు రోజులపాటు కోస్తా, సీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ, విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రాలు తెలిపాయి. తమిళనాడులోనూ బుధవారం నుంచి రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించాయి. ఇంకోవైపు.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. దీంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. మంగళవారం నుంచి 11వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని భారత వాతావరణ, విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రాలు హెచ్చరించాయి. సోమవారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడ్డాయి. వాయుగుండం కారణంగా.. ఏపీ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షపాతం 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీ మీటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.  గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని తెలిపింది.

Updated Date - 2021-11-09T07:23:28+05:30 IST