ఏపీకి భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2021-08-27T21:55:06+05:30 IST

ఏపీలో పలు జిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని

ఏపీకి భారీ వర్ష సూచన

అమరావతి: ఏపీలో పలు జిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని, అలాగే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఉత్తర బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇది దిశ మార్చుకొని ఆంధ్రప్రదేశ్‌ మీదుగా తెలంగాణ వైపు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కోస్తాలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. గురువారం కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో వెంకటగిరిలో 6.1 సెంటీమీటర్లు, తవనంపల్లెలో 5.1, గోరంట్లలో 4.9, కృత్తివెన్నులో 4.6,నూజివీడులో 4.5, తాడేపల్లిగూడెంలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - 2021-08-27T21:55:06+05:30 IST