జేసీల పరిధిలోకి ‘ఆరోగ్యం’

ABN , First Publish Date - 2021-06-22T08:52:20+05:30 IST

వైద్య, ఆరోగ్య శాఖలో జిల్లా కలెక్టర్లకు ఉన్న కీలక అధికారాలను జాయింట్‌ కలెక్టర్లకు (విలేజ్‌ వార్డు సెక్రటేరియల్‌-డెవల్‌పమెంట్‌)కు బదలాయించారు

జేసీల పరిధిలోకి ‘ఆరోగ్యం’

జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధికారాలు బదిలీ 

ఉద్యోగాల నియామకం సహా కీలక విధులు 


అమరావతి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్య శాఖలో జిల్లా కలెక్టర్లకు ఉన్న కీలక అధికారాలను జాయింట్‌ కలెక్టర్లకు (విలేజ్‌ వార్డు సెక్రటేరియల్‌-డెవల్‌పమెంట్‌)కు బదలాయించారు. సోమవారం రాష్ట్ర  వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు  వైద్య రంగం జేసీల (డెవల్‌పమెంట్‌) దగ్గరే ఉన్నా.. కొన్ని కీలక అధికారాలు కలెక్టర్ల పరిధిలోనే ఉండేవి. తాజాగా ఆర్థిక పరమైన, ఇతర అధికారాలు కూడా పూర్తిగా జేసీల బదలాయిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు (జీవో-64)జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖను జిల్లా స్థాయిలో పర్యవేక్షించడంతో పాటు ఉద్యోగాల నియామకం, అధికారులు, సిబ్బంది సర్వీసు అంశాల పరిశీలన, చట్టాల అమలుతో పాటు డిసిప్లినరీ అథారిటీగా డెవల్‌పమెంట్‌ జేసీ వ్యవహరిస్తారు. పీసీ, పీఎన్‌డీ చట్టం అమలు, నియంత్రణ, క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ చట్టం అమలు, నియంత్రణ, ఆహార భద్రత, కల్తీ నిరోధక చట్టం-జిల్లా స్థాయి అథారిటీ బాధ్యతలను బదలాయించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణతో పాటు జిల్లా స్థాయి హెల్త్‌ సొసైటీ చైర్మన్‌గా జేసీలు (డెవలప్‌మెంట్‌) వ్యవహరిస్తారు. హెచ్‌డీఎస్‌ కింద వైద్య, ఆరోగ్య రంగంలోని సంస్థలకు, ఆస్పత్రి డెవల్‌పమెంట్‌ సొసైటీలకు నిధులు మంజూరు చేస్తారు. ఆరోగ్య శాఖ కార్యక్రమాలను, వైఎ్‌సఆర్‌ నగర, గ్రామీణ క్లినిక్‌లను పర్యవేక్షిస్తారు. ఆరోగ్యశ్రీకి జిల్లా స్థాయి ఎక్స్‌అఫీషియో అదనపు సీఈఓగా వ్యవహరిస్తారు. 


ఆర్థికేతర విధులు

టీకాలు, వ్యాధుల నియంత్రణ వంటి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ ఆస్పత్రుల పర్యవేక్షణ, సూపరింటెండెంట్‌ల పనితీరుపై సమీక్షిస్తారు. ఆయుష్‌, డ్ర గ్‌ విభాగం జేసీ నియంత్రణలో ఉంటుంది. వైద్య, ఆరోగ్య రంగంలో వివిధ విభాగాల్లో ఉద్యోగ నియామకాల విభాగాన్ని చేపట్టే డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. ఆ శాఖలోని జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి అధికారులు జేసీకి రిపోర్టు చేయాలి. వారి సర్వీసు అంశాలు కూడా జేసీ నియంత్రణలోనే ఉంటాయి. తనకిచ్చిన అధికారాల పరిధిలో వైద్య, ఆరోగ్యశాఖ పనితీరు, అత్యవసరమైన అంశాలపై జిల్లా కలెక్టర్‌కు వారాంతపు నివేదికలను  సమర్పించాలి.

Updated Date - 2021-06-22T08:52:20+05:30 IST