ఎన్‌టీపీసీలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎనర్జీ స్టోరేజీ

ABN , First Publish Date - 2021-12-31T08:44:32+05:30 IST

ఎన్‌టీపీసీలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎనర్జీ స్టోరేజీ

ఎన్‌టీపీసీలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎనర్జీ స్టోరేజీ

విద్యుత్‌ నిల్వకు దేశంలోనే తొలి పైలట్‌ ప్రాజెక్ట్‌

శంకుస్థాపన చేసిన సీజీఎం దివాకర్‌ కౌశిక్‌


పరవాడ, డిసెంబరు 30: గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆధారిత ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టు విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు కానుంది. పరవాడ సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్టీపీసీ)లోని దీపాంజలి నగర్‌ సముద్రిక అతిథి గృహం వద్ద ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు సీజీఎం దివాకర్‌ కౌశిక్‌ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రోజన్‌ ఆధారిత విద్యుత్‌ను నిల్వచేసే పైలట్‌ ప్రాజెక్టును దేశంలోనే తొలిసారిగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీనికోసం రూ.9 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. దీని నిర్మాణ పనులను బెంగళూరుకు చెందిన బ్లూమ్‌ ఎనర్జీ సంస్థకు అప్పగించామని తెలిపారు. ఎనిమిది నెలల్లో నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 50 కిలోవాట్స్‌ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నమూనాను ఎన్టీపీసీ ఇంజనీర్లు రూపొందించారన్నారు. కార్యక్రమంలో సింహాద్రి ఎస్‌ఎ్‌ససీ విభాగం సీజీఎం శ్రీవాత్సవ్‌, ఓ అండ్‌ ఎం విభాగం జీఎంలు సీజే చౌక్సే, పీకే జేనా, హెచ్‌ఆర్‌ ఏజీఎం రూమాడే శర్మ, ఎల్‌క్ర్టికల్‌ విభాగం డీజీఎం నాగేశ్వరరావు, పీఆర్వో మల్లయ్య, బ్లూమ్‌ ఎనర్జీ సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


సోలార్‌ ప్రాజెక్ట్‌ నుంచి విద్యుదుత్పత్తి

ఎన్‌టీపీసీ ఇక్కడ బొగ్గుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. అది కాకుండా సోలార్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి ఇటీవల ఫ్లోటింగ్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. దాని ద్వారా వచ్చే కాలుష్య రహిత విద్యుత్‌ను తీసుకొని, హైడ్రోజన్‌ సాయంతో అధిక పీడనం వద్ద కంప్రెస్డ్‌ విధానంలో బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. దీనికి 50 కిలోవాట్ల ఆక్సైడ్‌ బ్యాటరీలు ఉపయోగిస్తారు.

Updated Date - 2021-12-31T08:44:32+05:30 IST