అక్కర్లేదన్నదే అక్కరకు!

ABN , First Publish Date - 2021-02-26T09:10:24+05:30 IST

‘మద్యంపై వచ్చే ఆదాయం మాకొద్దే వద్దు. దశలవారీగా మద్య నిషేధం కోసం మేం తీసుకుంటున్న చర్యలతో భారీగా అమ్మకాలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో తాగేవారి సంఖ్య చాలా తగ్గింది’ అన్న వైసీపీ సర్కారు పెద్దల మాటలు గుర్తున్నాయా? ఆ మాటలు చూసి...

అక్కర్లేదన్నదే అక్కరకు!

  • మందుపై ఆదాయం 16వేల కోట్లు
  • 1.69 కోట్ల కేసుల లిక్కర్‌ తాగేశారు 
  • 48 లక్షల కేసుల బీరు కుమ్మేశారు
  • ఇంకా నెలకుపైగా అమ్మకానికి వీలు
  • అప్పటికి గత ఏడాదిలాగే 17వేలకోట్లు
  • కరోనాతో మధ్యలో ఒక నెలంతా బంద్‌
  • లేదంటే రూ.20వేల కోట్లపై మాటే
  • అమ్మకాల్లో విశాఖ, తూర్పు టాప్‌
  • ఉపయోగం లేని నిషేధ చర్యలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘మద్యంపై వచ్చే ఆదాయం మాకొద్దే వద్దు. దశలవారీగా మద్య నిషేధం కోసం మేం తీసుకుంటున్న చర్యలతో భారీగా అమ్మకాలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో తాగేవారి సంఖ్య చాలా తగ్గింది’ అన్న వైసీపీ సర్కారు పెద్దల మాటలు గుర్తున్నాయా? ఆ మాటలు చూసి ఈ ఏడాది ఆదాయం ఎంత పడిపోతుందో అని ఎవరైనా ఊహించి ఉంటే అది పెద్ద పొరపాటే. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో మద్యంపై ప్రభుత్వానికి రూ.17,500 కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది ఇంకా 35 రోజులు మిగిలుండగానే మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.16వేల కోట్ల ఆదాయం వచ్చేసింది. ఇక మిగిలిన రోజుల అమ్మకాలు కూడా పూర్తయితే గతేడాది స్థాయిలోనే ఆదాయం సమకూరనుంది. అమ్మకాలు బాగా జరిగితే ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. పైగా, కరోనా, లాక్‌డౌన్‌, ధరల పెంపు, ఆ వెంటనే తూచ్‌.. ఇలా రాష్ట్రంలో మద్య విధానం గందరగోళపెట్టిన సమయంలోనూ లిక్కర్‌పై సర్కారుకు ఆదాయం తగ్గకపోవడం కొసమెరుపు..


కరోనాకూ తలవంచక..

కరోనా కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వంలోని స్టాంపులు, రిజిస్ర్టేషన్లు, రవాణా, మైనింగ్‌ లాంటి రంగాలు కూడా ఆదాయంలో కుదేలయ్యాయి. కానీ ఎక్సైజ్‌ మాత్రం అందుకు భిన్నంగా ఆదాయాన్ని అనుకున్నంత తెచ్చిపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అధికారికంగానే ఎక్పైజ్‌ ద్వారా రూ.7,500 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో పేర్కొంది. దానిపై వ్యాట్‌ కలిపితే దాదాపు రూ.20వేల కోట్లు వస్తుందని అంచనా వేసింది. గతేడాది రూ.17,500 కోట్లకు ఇది రూ.2,500 కోట్లు ఎక్కువ. కానీ ఊహించని విధంగా మధ్యలో వచ్చిన కరోనా అందరి అంచనాలు తారుమారు చేసింది. కరోనా వల్ల మద్యం షాపులు నెల రోజుల పాటు పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. అయినా ప్రతి ఏటా 12 నెలల్లో వచ్చే ఆదాయం ఈ ఏడాది 11 నెలల్లో వస్తుందంటే ప్రభుత్వం వేసుకున్న అంచనాలు దాదాపుగా నిజమయినట్టే. అదే మధ్యలో నెల కూడా అమ్మకాలు ఉంటే ప్రభుత్వం అనుకున్నట్టుగా ఈ ఏడాది మద్యం అదాయం రూ.20వేల కోట్ల చేరేది.


అంతా ఉత్తిదే..

ప్రధానంగా 4380 మద్యం షాపుల్లో 33శాతం షాపులను  దశలవారీ మద్యనిషేధ చర్యల్లో భాగంగా తగ్గించి ప్రస్తుతం 2900కు కుదించారు. మూడో వంతు షాపులు తగ్గించారు కాబట్టి అమ్మకాలు కూడా అంతే తగ్గిపోతాయన్నట్టు ప్రభుత్వ పెద్దలు చెబుతూ వచ్చారు. మద్యం షాపుల వద్దే మందు తాగేందుకు వీలుండే పర్మిట్‌ రూమ్‌లను పూర్తిగా తొలగించారు. పలుమార్లు మద్యం ధరలను పెంచారు. ఇన్ని చర్యలు తీసుకున్నా అమ్మకాలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 1,69,72,429 కేసుల లిక్కర్‌, 48,65,367 కేసుల బీరు అమ్ముడైంది. వీటి మొత్తం విలువ రూ.18,620 కోట్లు. ఇందులో ఉత్పత్తి వ్యయం, షాపుల నిర్వహణ, ఇతర ఖర్చులు తీసేసినా సుమారు రూ.16వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఇప్పటికే ఆదాయం వచ్చింది. అత్యధికంగా విశాఖపట్నంలో రూ.2360 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.1979 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ భారీగా మందు అమ్ముడైంది. దీంతో ప్రభుత్వం తీసుకున్న దశలవారీ నిషేధ చర్యలన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయాయి. 


ఊరికి ఐదారు బెల్టులు..

నిజంగా అమ్మకాలు తగ్గించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే షాపుల్లో సరుకు కూడా తగ్గించాలి.. అలా కాకుండా షాపుల సంఖ్య తగ్గించి, ఉన్న షాపుల్లోనే భారీగా మద్యం అందుబాటులో ఉంచితే అమ్మకాలు ఎలా తగ్గుతాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ఒకేసారి భారీగా మద్యం తెచ్చి బెల్టుల్లో అమ్ముతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో వ్యవస్థీకృతంగా అక్కడక్కడా బెల్టులు షాపులుంటే, ఇప్పుడు గ్రామానికి ఐదారు బెల్టులు తెరపైకి వచ్చాయి.


కరోనా కారణంగా నెలరోజులు అమ్మకాలు పూర్తిగా బంద్‌...బార్లు దాదాపు నాలుగు నెలలపాటు మూత... షాపుల సంఖ్య కూడా 500కుపైగా తగ్గింపు.! ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో మద్యం ‘చీర్స్‌’ చెప్పింది! మిగతారంగాలన్నీ ఢమాలుమనగా.. ‘వద్దు.. మందు అసలొద్దు’ అని సర్కారు ఛీత్కరించిన లిక్కర్‌ ఆదాయం మాత్రం, అనూహ్యంగా పొంగిపొర్లింది! 


Updated Date - 2021-02-26T09:10:24+05:30 IST