నేతన్నకు దగా!

ABN , First Publish Date - 2021-08-10T08:26:01+05:30 IST

పని చేసే వారిని ప్రోత్సహించాలి. ముడి సరుకు కొనుగోలుకు ఊతమివ్వాలి. ఉత్పత్తిని పెంచేలా రాయితీలు ఇవ్వాలి. చేనేత కార్మికులకు గతంలో అచ్చంగా ఇలాంటి ‘నిర్మాణాత్మక’ సహాయం అందేది...

నేతన్నకు దగా!

  • పాత పథకాల ద్వారా రూ.50 వేల వరకు లబ్ధి
  • అవన్నీ తీసేసి రూ.24 వేల నగదు బదిలీతో సరి!
  • నాడు పనిని, ఉత్పత్తిని ప్రోత్సహించే రాయితీలు
  • నేడు.. రాజకీయ లబ్ధికి పనికొచ్చేలా ‘పథకం’ 
  • ఇంట్లో ఇతర పథకాలు వర్తిస్తే ‘నేస్తం’ కోత
  • అందరికీ ఇస్తామన్నారు.. అర్హుల్ని తొలగించారు 
  • ఏటేటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య
  • గత ఏడాది 82 వేల మంది.. ఈసారి 80 వేలే!


పంచె పీకి... తువ్వాలు కప్పిన సర్కారు

ఇతరత్రా అన్ని పథకాలను రద్దు చేయడం! ఒక కొత్త పేరు పెట్టి, ‘మీట నొక్కి’ నేరుగా నగదు బదిలీ చేయడం! కోట్లు పెట్టి ప్రచారం చేసుకోవడం! ఇది ‘సంక్షేమ మాయ!’. పోనీ... అంతకుముందుకంటే ఎక్కువ లబ్ధి జరుగుతుందా, అంటే అదీ లేదు! మంగళవారం ‘నేతన్న నేస్తం’ పథకం కింద చేనేత కార్మికులకు డబ్బులు జమ చేస్తున్నారు. ఇందులోనే అనేక కోతలు, వాతలూ! ఈ పథకం లోగుట్టు ఏమిటో చూద్దాం!



(అమరావతి - ఆంధ్రజ్యోతి)

పని చేసే వారిని ప్రోత్సహించాలి. ముడి సరుకు కొనుగోలుకు ఊతమివ్వాలి. ఉత్పత్తిని పెంచేలా రాయితీలు ఇవ్వాలి. చేనేత కార్మికులకు గతంలో అచ్చంగా ఇలాంటి ‘నిర్మాణాత్మక’ సహాయం అందేది. ఇప్పుడు అవన్నీ పోయాయి. నేరుగా నగదు మాత్రమే మిగిలింది. ఆ పథకం పేరే... ‘నేతన్న నేస్తం’. పాత పథకాల ద్వారా ఒక్కో నేత కార్మికుడికి ఏటా రూ.50 వేల వరకు లబ్ధి చేకూరేది. ఇప్పుడు... రూ.24 వేల నగదు మాత్రం దక్కుతోంది. అంటే... రూపాయి స్థానంలో అర్ధరూపాయి ఇచ్చి, దానినే గొప్పగా చెప్పుకొంటున్నారన్న మాట! రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్న నేస్తం’ పేరుతో రూ.24 వేలు ఇస్తూ... చేనేత కార్మికులకు ఇతరత్రా అందే ఎంతో లబ్ధిని దూరం చేసింది. గతంలో మగ్గం ఉన్న ప్రతి కార్మికుడికి ప్రోత్సాహకం కింద ప్రభుత్వం ఏటా రూ.4 వేలు ఇచ్చేది. ఇక.. వర్షాకాలంలో పనిచేయలేని పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో ఏటా మరో రూ.4 వేలు వచ్చేవి. అంటే... ఏటా రూ.8 వేల నగదు లభించేది. ఇక... సొంత మగ్గాలు ఏర్పాటు చేసుకునే వారికి 40 శాతం రాయితీతో రూ.2లక్షల వరకూ రుణం అందేది. అంటే... ఈ పథకం కింద రూ.80 వేల లబ్ధి చేకూరేది. అలాగే... మగ్గం ఆధునీకరణకు ‘ట్రిపుల్‌ ఆర్‌’ పథకం కింద 20 శాతం సబ్సిడీతో ఆర్థిక తోడ్పాటు ఉండేది. ముడి సరుకు(యార్న్‌) కొనుగోలులో 30శాతం రాయితీ ఇచ్చేవారు. అనంతపురంలాంటి జిల్లాల్లో పట్టు దారంపైనా రాయితీ లభించేంది. త్రిఫ్ట్‌ ఫండ్‌గా కార్మికుడు 4శాతం ఇస్తే ప్రభుత్వం 8శాతం జమ చేసి వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేది. ఇవన్నీ కలిపితే రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికుడికి ఏటా కనీసం 50 వేల వరకూ ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరేది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పాత పథకాలన్నీ ఎత్తేసింది. రూ.24వేలు మాత్రం ఇస్తూ... ఇదే అద్భుతమంటూ ప్రచారం చేసుకుంటోంది. 


కష్ట కాలంలోనూ కోతలు...

‘మన ప్రభుత్వం వస్తుంది. నేతన్నలందరికీ న్యాయం జరుగుతుంది’... అంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ పదేపదే చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆయన తీరు ‘పంచెలాగేసి, తువ్వాలు కప్పినట్లుగా ఉంది’ అని చేనేత వర్గాలే విమర్శిస్తున్నాయి. పాత లబ్ధిని దూరం చేయడం ఒక ఎత్తు అయితే... ‘నేతన నేస్తం’లో లబ్ధిదారుల సంఖ్యలో ఏటేటా కోత పెట్టడం మరో ఎత్తు! రాష్ట్రంలో 3.50లక్షల మగ్గాలు ఉండేవి. అవి రాను రాను తగ్గిపోయి జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 1.90 లక్షలకు చేరాయి. కరోనా దెబ్బకు మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడం, చేనేత వస్త్రంపై కేంద్రం జీఎ్‌సటీ విధించడం తదితర కారణాలతో వీటి సంఖ్య మరింత పడిపోయింది. సొంత మగ్గాలతోపాటు చేనేత సొసైటీల పరిధిలో ఉన్న వాటిని లెక్కించిన చేనేత, జౌళిశాఖ 1.20 లక్షల మగ్గాలు ఉన్నట్లు చెబుతోంది. మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికీ ‘నేస్తం’ అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం... మొదటి ఏడాది 82వేల మందికి మాత్రమే ఇచ్చింది. తమకు అన్యాయం జరిగిందని అర్హులు వాపోవడంతో... మళ్లీ అప్లై చేసుకోండి ఇస్తామని జగన్‌ చెప్పారు. సుమారు 40వేల మంది దరఖాస్తు చేసుకోగా... అధికారులు పరిశీలించి పదివేల మంది అర్హులు కాదంటూ తొలగించారు.  మిగిలిన 30వేల మందికి ఇచ్చారా.? అంటే ఇప్పటి వరకూ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. గత ఏడాది 82 వేలుగా ఉన్న లబ్ధిదారుల సంఖ్యను... ఇప్పుడు 80 వేలకు కుదించేసింది.




ఇతర పథకాలతో ముడి...

‘నేతన్న నేస్తం’ కోసం అర్హుల ఎంపిక గ్రామ, వార్డు వలంటీర్‌తో మొదలవుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఇంటికెళ్లి మగ్గం ఉందో లేదో పరిశీలించి... మగ్గం ఉంటే జియో ట్యాగింగ్‌ చేస్తారు. అక్కడి నుంచి ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్‌కు జాబితా చేరుతుంది. ఆ తర్వాత హ్యాండ్లూమ్స్‌ ఏడీ ఓకే చేశాక కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీకి పంపిస్తారు. అక్కడి నుంచి చేనేత కమిషనరేట్‌కు, ఆ తర్వాత ఆర్థిక శాఖకు తుది జాబితా చేరుతుంది. ఆపైన... సీఎం కార్యాలయ ప్రాంగణంలోని ఆర్టీజీఎ్‌సలో లబ్ధిదారుడి ‘ఆధార్‌’తో తనిఖీ చేస్తారు. ఆ కుటుంబంలో ఎవరికైనా ఇతర పథకం  వస్తుంటే వెంటనే పేరు డిలిట్‌ చేస్తారు. కార్మికుడి తల్లికి వృద్ధాప్య పెన్షన్‌, భార్యకు అమ్మ ఒడి, తండ్రికి రైతు భరోసా ఇలా ఏ ఒక్క పథకం వర్తించినా సరే... నిజమైన చేనేత కార్మికుడు కూడా నేతన్న నేస్తానికి దూరమవుతాడు. అంటే... చేనేత కార్మికుడికి పాత లబ్ధినీ దూరం చేసి, ఇప్పుడు అందరితోపాటు లభించే ప్రయోజనాలనూ దూరం చేస్తున్నారు.


రాజకీయ రంగు...

సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, పార్టీ చూడం... అని సీఎం జగన్‌ పలుమార్లు ప్రకటించారు. అయితే గ్రామాల్లో అందుకు భిన్నంగా వైసీపీకి ఓటెయ్యని వారిని, వలంటీర్లకు నచ్చని వారిని, డబ్బులు ఇవ్వని లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించేస్తున్నారు. ఉదాహరణకు... అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో చేనేతలు తమకు నేతన్న నేస్తం అందలేదని ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశంతో హ్యాండ్లూమ్స్‌ ఏడీ ఆ గ్రామాన్ని పరిశీలించి.. వారందరికీ మగ్గాలు ఉన్నట్లు నిర్ధారించారు. మరి నేస్తం నుంచి ఎందుకు తొలగించారని ఆరా తీయగా, వారంతా టీడీపీకి ఓటేసినందుకు స్థానిక వైసీపీ నేతల ఒత్తిడితో పేర్లు తీసేసినట్లు తేలింది. ఇప్పటి వరకూ వారికి న్యాయం జరగలేదు. ప్రకాశం జిల్లా చీరాల, కృష్ణా జిల్లా పెడనతోపాటు గోదావరి జిల్లాల్లో పలుచోట్ల వలంటీర్లు రూ.రెండు నుంచి మూడు వేలు అడుగుతున్నారని, ఇవ్వకుంటే జియో ట్యాగింగ్‌ చేయకుండా ఇంట్లో లేరంటూ రాస్తున్నారని చేనేతన్నలు వాపోతున్నారు.


అనుబంధ కార్మికులకు అన్యాయం

ఒక చేనేత మగ్గం ఉందంటే దానిపై నేత కార్మికుడితోపాటు నలుగురు అదనంగా బతుకుతారు. నూలు వడకడం, రాట్నం తిప్పడం, రంగులద్దడం, దారం బొందులు ఎక్కించడం లాంటి పనులు చేసే ఒక్కరికి కూడా నేతన్న నేస్తం లభించదు. మగ్గం ఉన్నన వారికి మాత్రమే అని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో అనుబంధ కార్మికులైన వీరికి పూర్తిగా అన్యాయం జరుగుతోంది. వారికి కూడా నేతన్న నేస్తం అందించాలని ఆలిండియా హ్యాండ్లూమ్‌ రైట్స్‌ ఫోరం అధ్యక్షుడు జ్వాలా నరసింహం ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా స్పందనలేదు.

Updated Date - 2021-08-10T08:26:01+05:30 IST