సీజేఐకి సర్కారు తేనీటి విందు
ABN , First Publish Date - 2021-12-26T07:33:33+05:30 IST
సీజేఐకి సర్కారు తేనీటి విందు

హోటల్‌లో 50 నిమిషాలపాటు జగన్ భేటీ
సతీమణితో కలిసివెళ్లి ఆహ్వానం
తేనీటి విందులో టేబుళ్ల వద్ద కలివిడిగా జస్టిస్ రమణకు మంత్రుల పరిచయం
జడ్జీలకు జగన్‌ను పరిచయం చేసిన సీజేఐ
పర్యటన రెండోరోజు జస్టిస్ రమణను కలుసుకున్న పలువురు ప్రముఖులు
అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తేనీటి విందు ఇచ్చారు. ఆయన గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి (హైటీ) రావాల్సిందిగా స్వయంగా తానే వెళ్లి ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సతీమణి భారతితో కలిసి విజయవాడలో సీజే ఉంటున్న హోటల్‌కు వచ్చిన ముఖ్యమంత్రి... దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు. సీజే దంపతులను కలిసి మాట్లాడారు. మధ్యాహ్నం మూడుగంటల సమయంలో వచ్చిన సీఎం దంపతులు.. నాలుగు గంటల వరకు సీజే దంపతులతో ఉన్నారు. హోటల్‌లో సీజే ఉంటున్న సూట్‌కి వెళ్లి అక్కడే తేనీరు సేవిస్తూ సుమారు యాభై నిమిషాలు మాట్లాడుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మూడురోజుల రాష్ట్ర పర్యటనకు రావడంతో సీఎం దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
మంత్రులను సీజేఐకు పరిచయం చేసిన జగన్
జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం విందును ఇచ్చింది. ఈ విందులో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం ఇందిరాగాంధీ స్టేడియం వద్దకు చేరుకున్న జస్టిస్ రమణకు సీఎం జగన్ దంపతులు ఆహ్వానం పలికారు. విందుకు హాజరైన హైకోర్టు జడ్జీలను జగన్‌కు జస్టిస్ రమణ పరిచయం చేశారు. ఇదేసమయంలో, విందుకు హాజరైన ఐఏఎ్‌స,ఐపీఎస్ అధికారులనూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఆయనకు సీఎం పరిచయం చేశారు. టేబుళ్ల వద్దకు వెళ్లి మరీ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులను సీజేఐ పలకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేంకటేశ్వరస్వామి ప్రతిమను జస్టిస్ రమణకు ముఖ్యమంత్రి బహూకరించారు.
క్రిస్మస్ వేడుకల్లో జస్టిస్ రమణ దంపతులు
జస్టిస్ రమణ బసచేసిన హోటల్‌లో శనివారం క్రిస్మస్ వేడుక లు నిర్వహించారు. ఆ వేడుకల్లో రమణ దంపతులు పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్‌ను కట్‌చేశారు. క్రిస్మస్ పండగ శాంతి సౌభ్రాతృత్వాలకు ప్రతీక అని జస్టిస్ రమణ ఉద్బోధించారు.

