‘సాగు’పై సర్కార్ కోతలు
ABN , First Publish Date - 2021-05-21T08:41:19+05:30 IST
రైతు బాంధవ ప్రభుత్వంగా చెప్పుకొంటున్న ఏపీ సర్కారు... బడ్జెట్‌లో వ్యవసాయ పథకాలకు కేటాయింపులను తగ్గించింది. భూమిపుత్రుల రుణం తీర్చుకుంటున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంక్షేమ పథకాలకు నిరుటికంటే

ప్రకటనల్లోనే రైతు సంక్షేమం!.. దృష్టంతా ‘అమూల్’ సేవపైనే
రోజుకు 2 కోట్ల లీటర్ల పాలే లక్ష్యం.. వ్యవసాయానికి పెంచిందేమీ లేదు
రైతు సంక్షేమానికీ కంటితుడుపే.. అదనపు ‘భరోసా’ రూ.4.38 కోట్లే
పశునష్ట పథకానికి రూ.50కోట్లు.. రైతుల పరిహారానికి 20 కోట్లే
ధరల నిధికి రూ. 2,500కోట్ల కోత.. ‘సున్నావడ్డీ’లో రూ.600 కోట్లు కట్
సర్కారు చెప్పిన సాగు పద్దు ఇదీ... వ్యవసాయశాఖకు 14,049.29 కోట్లు
అనుబంధంతో కలిపి 31,256కోట్లు : కన్నబాబు
గతేడాదితో పోల్చితే తగ్గిన బడ్జెట్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రైతు బాంధవ ప్రభుత్వంగా చెప్పుకొంటున్న ఏపీ సర్కారు... బడ్జెట్‌లో వ్యవసాయ పథకాలకు కేటాయింపులను తగ్గించింది. భూమిపుత్రుల రుణం తీర్చుకుంటున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంక్షేమ పథకాలకు నిరుటికంటే పెద్దగా పెంచిందేమీ లేదు. పశునష్ట పథకానికి ఇచ్చింది రూ.50కోట్లు. రైతులెవరైనా ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు అందించే పరిహారానికి మాత్రం కేవలం రూ.20కోట్లే కేటాయించడం గమనార్హం. గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి కేటాయింపులు పెంచకపోగా, రైతుసంక్షేమ పథకాలకు ప్రభుత్వం నామమాత్రంగానే నిధులు కేటాయించింది. వైఎస్సార్ పేరుతో అమలుచేస్తున్న రైతుభరోసా పథకానికి గతేడాది కంటే ఈ బడ్జెట్‌లో పెంచింది కేవలం రూ.4.38కోట్లే. కానీ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకానికి 2021-22 కింద రూ.7,400కోట్లు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తుల్లో మార్కెట్ జోక్యంకోసం ఏటా రూ.3వేల కోట్లతో ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించినా.. ఈఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.500 కోట్లే ప్రతిపాదించారు. వ్యవసాయం,అనుబంధ రంగాలకు 2020-21 బడ్జెట్ అంచనాల్లో రెవిన్యూ, కేపిటల్‌తో కలిపి రూ. 13,617.55కోట్లు కేటాయించారు. కానీ తాజా గణాంకాల్లో 2020-21కింద రూ.10,668.84 కోట్లుగా మాత్రమే చూపారు. అంటే సుమారు 3వేల కోట్లు తక్కువ ఖర్చు చేశారు.
అందుకోని అంచనాలు..: 2021-22 బడ్జెట్ వ్వవసాయశాఖ ద్వారా అమలు చేసే పథకాలకు రూ.14,049.29 కోట్లుకేటాయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో ప్రకటించారు. విద్యుత్ రాయితీ, ఉపాధి హామీ పథకం, జలకళ అన్నీ కలిపి, వ్యవసాయ, అనుబంధ రంగాలతో కలిపి రూ.31,256 కోట్లుగా ప్రతిపాదించారు. రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకునే రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రీయింబర్స్‌మెంట్‌కు నిరుడు రూ.1,100కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది రూ.500 మాత్రమే ప్రతిపాదించారు. విత్తన పంపిణీకి గతేడాది రూ.192 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది రూ.100కోట్లే కేటాయించారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటే, వారి కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియా కింద నిరుడు రూ.18.45కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది రూ.20కోట్లు కేటాయించారు. 2020-21లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 5.75ు బడ్జెట్ కేటాయింపులు జరగ్గా, ఈ ఏడాది 5.88ు కేటాయింపు జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాలపై గత ప్రభుత్వం 2018-19లో రూ.277.70కోట్లు పెట్టుబడి వ్యయం చేయగా, ప్రస్తుత ప్రభుత్వం 2019-20లో రూ.189.70కోట్లు, 2020-21లో రూ.167.87కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. కానీ 2021-22లో రూ.740.18 కోట్లు పెట్టుబడి వ్యయం లక్ష్యంగా బడ్జెట్‌లో చూపా రు. శాస్త్రసాంకేతిక, పర్యావరణశాఖకు 2020-21లో రూ.10.73 కోట్లుగా అంచనావేసినా, రూ.7.52కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2021-22 బడ్జెట్‌లో ఈ శాఖలకు రూ.10.68కోట్లు కేటాయించారు. అలాగే వైఎస్సార్ మత్స్యకార భరోసాకు రూ.120కోట్లు, జాలర్ల డీజిల్ సబ్సిడీకి రూ.50కోట్లు ప్రతిపాదించారు.
అమూల్‌కు రోజుకు 2కోట్ల లీటర్ల పాలు
రాష్ట్రంలో అమూల్ ప్రాజెక్ట్‌కోసం రోజుకు రెండుకో ట్ల లీటర్ల పాలు సిద్ధంచేయడమే లక్ష్యమని ప్రభు త్వం ప్రకటించింది. 27లక్షల మంది మహిళల్ని అమూల్ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం చేసి, 9,899 మహిళా పాల సంఘాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు బడ్జెట్‌లో ప్రస్తావించారు. లీటరుకు రూ.5 నుంచి రూ.17 దాకా పాల ఉత్పత్తిదారులు అదనపు లబ్ధి పొందుతున్నట్లు పేర్కొంది.
బీమా చెల్లింపులకు ఏపీజీఐసీ ఏర్పాటు
రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు కోసం ఏపీ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీని త్వరలో స్థాపించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు. వైఎస్సార్ పంటల బీమాకి 2021-22లో రూ.1,802.82కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. 2020ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల బీమా సొమ్మును త్వరలో చెల్లిస్తామని తెలిపారు.
2021-22 సాగు పద్దు (రూ.కోట్లలో)
వైఎస్సార్ రైతుభరోసా 6,876.50
ఉచిత పంటల బీమా పథకం 1.802.82
ప్రకృతి విపత్తుల పహాయ నిధి 2,000.00
రైతులకు సున్నా వడ్డీ రాయితీ 500.00
ఆర్‌కేవీవై 583.44
ధరల నియంత్రణ నిధి 500.00
పీఎంకేఎ్‌సవై 300.00
రాయితీ విత్తన పంపిణీకి 100.00
అగ్రి మార్కెటింగ్ ఇన్‌ఫ్రా ఫండ్ 100.00
వ్యవసాయ యాంత్రీకరణ 739.46
ప్రకృతి సేద్యానికి 311,62
పొలం బడి కార్యక్రమాలకు 61,91
వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ 88.57
రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా 20.00
ఇతర పథకాలకు 2,631.21
అనుబంధ రంగాలకు కేటాయింపులు
వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ 5,000.00
ఉపాధి హామీ పథకం 8,116,16
పశుసంవర్ధకశాఖ 1,026.37
మత్స్య రంగానికి 329.48
అటవీ,పర్యావరణం 806.47
మార్కెటింగ్‌శాఖ 610.80
ఉద్యానశాఖ 537.03
సహాకరశాఖకు 303.04
ఫుడ్‌ప్రొసెసింగ్ 186.91
పట్టు పరిశ్రమ 97.36
అగ్రివర్సిటీ 359.76
పశువైద్య వర్సిటీ 147.31
ఉద్యాన వర్సిటీ 69.91
వైఎస్సార్ జలకళ 200.00