‘గోశాలైట్స్‌’..భారీ టోకరా!

ABN , First Publish Date - 2021-05-30T09:07:54+05:30 IST

ఆ ఐదుగురు... తిన్న ఇంటికే కన్నం వేశారు. కొలువులు వెలగబెడుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థ నుంచి సర్వం కాజేసి, పోటీగా సమీపంలోనే ‘గోశాలైట్స్‌’ పేరుతో మరో క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు

‘గోశాలైట్స్‌’..భారీ టోకరా!

శ్రీచైతన్య సాఫ్ట్‌వేర్‌, బోధన సామగ్రి చోరీ 

మొత్తం రూ.100 కోట్ల కుంభకోణం 

పోలీసులకు శ్రీచైతన్య ఏజీఎం ఫిర్యాదు 


విజయవాడ, మే 29(ఆంధ్రజ్యోతి): ఆ ఐదుగురు... తిన్న ఇంటికే కన్నం వేశారు. కొలువులు వెలగబెడుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థ నుంచి సర్వం కాజేసి, పోటీగా సమీపంలోనే ‘గోశాలైట్స్‌’ పేరుతో మరో క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. పోలీసుల కథనం మేరకు... శ్రీచైతన్య కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామం గోశాలలో ఐఐటీ, జేఈఈ కోర్సులతో క్యాంపస్‌ను నిర్వహిస్తోంది. దీనికి ఇన్‌చార్జిగా ఎంవీ నరేంద్రబాబు వ్యవహరిస్తుండేవాడు. శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన బోధన సామగ్రిని సహాయకుల ద్వారా క్యాంపస్‌ నుంచి నరేంద్రబాబు బయటకు తరలించాడు. తర్వాత ఆ సంస్థ సాఫ్ట్‌వేర్‌ను చోరీ చేశాడు. క్యాంపస్‌కు సంబంధించిన రూ.15లక్షల నిధులు దారి మళ్లించి పెనమలూరులో గోశాలైట్స్‌ పేరుతో ప్రత్యేకంగా ఒక క్యాంపస్‌ను ప్రారంభించాడు. నరేంద్రబాబు, అతడికి సహకరించిన ఎన్‌.శ్రీనివాసరావు, జి.బాలకృష్ణ ప్రసాద్‌, బెల్లంకొండ శైలజ, వై.శ్రీనివాసరావు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉద్యోగం మానేశారు. శ్రీచైతన్య ప్రతినిధులు ఆరాతీయగా నిధులు, బోధన సామగ్రి, సాఫ్ట్‌వేర్‌, ఆన్‌లైన్‌ మెటీరియల్‌ మొత్తం గేటు దాటేసినట్టు తేలింది. నరేంద్రబాబు బ్యాచ్‌ కారణంగా తమకు రూ.100కోట్ల వరకు నష్టం చేకూరిందని శ్రీచైతన్య ఏజీఎం మురళీకృష్ణ కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కాశీవిశ్వనాథ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది గోశాలైట్స్‌ క్యాంపస్‌లో శనివారం తనిఖీలు నిర్వహించారు. సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించారు. శ్రీచైతన్య సంస్థకు చెందిన మొత్తం మెటీరియల్‌ను సీజ్‌ చేశారు. నరేంద్రబాబుతో పాటు నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2021-05-30T09:07:54+05:30 IST