ఉగ్ర శిక్షణ కేంద్రంగా అఫ్ఘాన్‌

ABN , First Publish Date - 2021-08-27T09:05:05+05:30 IST

అఫ్ఘానిస్తాన్‌ను ఉగ్రవాద శిక్షణ కేంద్రంగా ఉగ్రవాద సంస్థలు మార్చేసాయని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ అన్నారు.

ఉగ్ర శిక్షణ కేంద్రంగా అఫ్ఘాన్‌

భారతీయులందరినీ సురక్షితంగా రప్పించండి

మన పెట్టుబడులు, ప్రాజెక్టుల సంరక్షణ ఎలా?

అఖిలపక్ష భేటీలో టీడీపీ ఎంపీ గల్లా


న్యూఢిల్లీ, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): అఫ్ఘానిస్తాన్‌ను ఉగ్రవాద శిక్షణ కేంద్రంగా ఉగ్రవాద సంస్థలు మార్చేసాయని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ అన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌ అధ్యక్షతన గురువారం ఇక్కడ అఫ్ఘానిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై జరిగిన అఖిలపక్షాల భేటీలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అఫ్ఘాన్‌లో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అఫ్ఘాన్‌లో ఉన్న తెలుగువారితో పాటు భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి రప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ సమస్యను పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి ఏం చేయబోతోందని ప్రశ్నించారు. అక్కడున్న కాపర్‌, లిథియం వనరులు చైనా చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని, ఈ విషయంలో భారత్‌ ఏ విధంగా వ్యవహరిస్తుందో చెప్పాలని అడిగారు. అఫ్ఘాన్‌లో భారత్‌ పెట్టిన 300 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, ఆయా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తాలిబన్ల సహకారంతో కశ్మీర్‌ను వశం చేసుకోవచ్చన్న పాకిస్తాన్‌ అధికార పార్టీ సభ్యుడి వ్యాఖ్యలను సమావేశం దృష్టికి తెచ్చారు.


భారతీయులను క్షేమంగా తీసుకురండి: మిథున్‌రెడ్డి

అఫ్ఘానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షింతంగా స్వదేశానికి తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, కేంద్ర మంత్రి జయశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. అఫ్ఘానిస్తాన్‌లో తెలుగువారు కూడ అనేక మంది పనిచేస్తున్నారన్నారు. అక్కడ మనం పెట్టిన పెట్టుబడులను సంరక్షించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. మన దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని వ్యూహాలను రచించాలని సూచించినట్లు మిథున్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-08-27T09:05:05+05:30 IST