నామినేషన్లకు పటిష్ఠ భద్రత
ABN , First Publish Date - 2021-02-26T08:00:19+05:30 IST
పురపాలక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమీపిస్తున్న దృష్ట్యా.. దాఖలైన నామినేషన్లను ఆయా పట్టణ స్థానిక సంస్థలకు తరలించి, పటిష్ఠ బందోబస్తు కల్పించేందుకు పురపాలకశాఖ చర్యలు తీసుకుంటోంది...

- 2, 3 తేదీల్లో ‘ఉపసంహరణ’కు ఏర్పాట్లు
- మున్సిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ ఆదేశాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పురపాలక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమీపిస్తున్న దృష్ట్యా.. దాఖలైన నామినేషన్లను ఆయా పట్టణ స్థానిక సంస్థలకు తరలించి, పటిష్ఠ బందోబస్తు కల్పించేందుకు పురపాలకశాఖ చర్యలు తీసుకుంటోంది. గతేడాది మార్చిలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలను కరోనా కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడం, అప్పటికే నామినేషన్ల ఘట్టం పూర్తవడం తెలిసిందే. అప్పటి నుంచి ఆ నామినేషన్లను జిల్లా ఉప ట్రెజరీ కార్యాలయాల్లో భద్రపరిచారు. వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెల 10న జరగనున్నాయి. ఆ మేరకు వచ్చే నెల 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరగబోతోంది. ఇది ముగిసిన వెంటనే (3వ తేదీనే) రంగంలో మిగిలిన అభ్యర్థుల జాబితాలను అధికారులు ప్రకటించనున్నారు. నామినేషన్లన్నింటినీ సంబంధిత నగరపాలక, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు తరలించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. తరలింపు ప్రక్రియతోపాటు భద్రపరడచం వరకూ మొత్తం కార్యక్రమాన్ని వీడియో తీయించాల్సిందిగా ఉన్నతాధికారులు నిర్దేశించారు. వివరాలను సమగ్రంగా నమోదు చేయడంతోపాటు నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకూ వాటన్నింటినీ సురక్షితంగా ఉంచేందుకు బందోబస్తు ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలని కూడా పురపాలక శాఖ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 75 పురపాలక సంఘాలు-నగర పంచాయతీలు, 12 నగరపాలక సంస్థల కమిషనర్లు సమాయత్తమవుతున్నారు.
ఆ పోలింగ్ కేంద్రాలకు ప్రత్యామ్నాయాలు..
పోలింగ్ కేంద్రాల్లో వేటినైనా ప్రస్తుతం అనివార్య కారణాల వల్ల మార్చాల్సి వస్తే వాటి స్థానంలో ప్రత్యామ్నాయ భవనాలను తక్షణమే గుర్తించాల్సిందిగా పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. అప్పట్లో గుర్తించిన పోలింగ్ కేంద్రాల్లో ఏడాది జాప్యం వల్ల ఇప్పుడు ఓటింగ్ నిర్వహించేందుకు వీల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటివాటికి ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాలు సూచిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు నివేదికలు పంపాల్సిందిగా పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్(సీడీఎంఏ) మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గతేడాది మున్సిపల్ ఎన్నికలకు నియమితులైన ఎలక్షన్ ఆఫీసర్లలో ఎవరైనా ప్రస్తుతం విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఉన్న పక్షంలో వారి స్థానాల్లో ఇతరులను నియమించాలని కూడా సీడీఎంఏ ఆదేశించారు.