దళితులకు సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ మోసం

ABN , First Publish Date - 2021-02-05T18:01:31+05:30 IST

సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ దళితుల నుంచి రూ. 4 కోట్లు దండుకుని ఓ మోసగాడు బోర్డు తిప్పేశాడు.

దళితులకు సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ మోసం

కర్నూలు జిల్లా: సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ దళితుల నుంచి రూ. 4 కోట్లు దండుకుని ఓ మోసగాడు బోర్డు తిప్పేశాడు. వర్ధన్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో మోసగాడు దళితులను కొంతకాలంగా మోసం చేస్తున్నాడు. కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన జగతపు జాషువా అనే వ్యక్తి గుంటూరు జిల్లా, తాడేపల్లి బైపాస్ రోడ్డులో వర్ధన్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. కేంద్ర ప్రభుత్వం పశువులు కొనుగోలు నిమిత్తం సబ్సిడీ రుణాలు ఇస్తుందని, ముందుగా రూ. లక్ష చెల్లిస్తే వారి అకౌంట్లోకి రూ.1.80 లక్షలు వస్తాయని నమ్మబలికాడు. 


తాడేపల్లిలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మాదిక కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకరాజు, కనకారావు, వేమూరు ఎమ్మెల్యే మెరుగ నాగార్జున చేతుల మీదుగా ప్రారంభించారు. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు అట్టహాసంగా కార్యాలయం ప్రారంభానికి రావడం.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసి దళితుల్లో నమ్మకం కలిగించాడు. దీంతో రుణాలు రావడం ఖాయమని దళితులు నమ్మి.. రాష్ట్ర నలుమూలలకు చెందిన దళితులు రూ. లక్ష కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే కొద్ది రోజులుగా కార్యాలయం మూసివేయడంతో డిపాజిట్ చేసినవారిలో భయం మొదలైంది. అతనిపై, అతని కుటుంబసభ్యులపై మూడు రాష్ట్రాల్లో 21 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి జాషువా కోసం దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-02-05T18:01:31+05:30 IST