ఆనందబాబు ఇంట్లో నర్సీపట్నం పోలీసుల హైడ్రామా!

ABN , First Publish Date - 2021-10-20T08:50:58+05:30 IST

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఇంట్లో నర్సీపట్నం పోలీసుల హైడ్రామా నడిచింది. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం ఉదయం కూడా ఆనందబాబు ఇంటికి వచ్చిన పోలీసులు.. నోటీసుల పేరుతో హడావుడి చేశారు. ఆయనను విచారించి

ఆనందబాబు ఇంట్లో నర్సీపట్నం పోలీసుల  హైడ్రామా!

  • నోటీసులు ఇచ్చేందుకు వచ్చామంటూ ఆనందబాబును విచారించిన సీఐ
  • నోటీసులు చేతికి ఇవ్వకుండా మాజీ మంత్రి ఇంటికి అతికించే యత్నం
  • చివరకు నోటీసులు ఇవ్వకుండానే వెనక్కి
  • సామాన్యుడికి మాట్లాడే స్వేచ్ఛ లేదా?
  • మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం


గుంటూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఇంట్లో నర్సీపట్నం పోలీసుల హైడ్రామా నడిచింది. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం ఉదయం కూడా ఆనందబాబు ఇంటికి వచ్చిన పోలీసులు.. నోటీసుల పేరుతో హడావుడి చేశారు. ఆయనను విచారించి స్టేట్‌మెంట్‌ నమోదు చేశారు. ఈ పరిణామం ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విశాఖ మన్యం నుంచి గంజాయి అక్రమరవాణా జరుగుతోందంటూ సోమవారం ఉదయం నక్కా ఆనందబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హుటాహుటిన స్పందించిన విశాఖజిల్లా నర్సీపట్నం పోలీసులు.. గుంటూరుజిల్లా, వసంతరాయపురంలోని నక్కా ఆనందబాబు ఇంటికి సోమవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయానికి చేరుకున్నారు. గంజాయి రవాణాకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని కోరారు. మీడియాలో ఏ ఆధారాలతో మాట్లాడారో చెబితే స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకుంటామన్నారు. అయితే, అర్ధరాత్రి సమయంలో ఇదేంటంటూ ఆనందబాబు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వెళ్లిపోయిన పోలీసులు మంగళవారం ఉదయం తిరిగి వచ్చారు. పోలీసుల రాకకు ముందే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు హైడ్రామా నడుమ నర్సీపట్నం సీఐ శ్రీనివాస్‌ ఆనందబాబు స్టెట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అనంతరం.. 91 సీఆర్‌పీసీ కింద నోటీసులను ఆనందబాబు ఇంటికి అంటించే ప్రయత్నం చేయగా.. తనకే ఇవ్వాలని ఆనందబాబు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆనందబాబు సరైన సమాచారం ఇవ్వలేదని, ఆయనకు వేరే రూపంలో నోటీసులు ఇస్తామని చెప్పి పోలీసులు వెళ్లిపోయారు. 


ప్రశ్నిస్తే నోటీసులా?

ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు తలా తోక లేని ప్రశ్నలు అడిగారని అసహనం వ్యక్తం చేశారు.  సామాన్యుడికి మాట్లాడే స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు. యువతను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, వారికి మద్యంతో పాటు గంజాయి అలవాటు చేస్తోందన్నారు. వీటిని ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా? అని మండిపడ్డారు.  


నోటీస్‌ ఇవ్వడానికే వచ్చాం: సీఐ 

నల్లగొండ పోలీసులు ఏజెన్సీలో కాల్పులు జరిపారని.. అదే రోజు నక్కా ఆనందబాబు మీడియా సమావేశంలో స్మగ్లింగ్‌ వెనుక నాయకులున్నారని చెప్పారని విశాఖ జిల్లా నర్సీపట్నం సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.  ఆధారలివ్వాలని అడిగామన్నారు. ఆనందబాబు స్టేట్‌మెంట్‌ రికార్డు చేశామన్నారు. అయితే, ఆయన వివరాలు వెల్లడించలేదని.. 91 సీఆర్పీసీ కింద నోటీసులిస్తామంటే తీసుకోలేదని చెప్పారు. 

Updated Date - 2021-10-20T08:50:58+05:30 IST