3 ప్రాంతాల అభివృద్ధికి మూడు పైసలైనా ఖర్చు చేశారా?

ABN , First Publish Date - 2021-11-23T08:42:16+05:30 IST

పాలనా వికేంద్రకరణ గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి మూడు పైసలైనా..

3 ప్రాంతాల అభివృద్ధికి  మూడు పైసలైనా ఖర్చు చేశారా?

  • వికేంద్రీకరణపై మాత్రం పెద్ద పెద్ద మాటలు చెపుతున్నారు
  • ప్రజల దృష్టి మళ్లించడానికే ‘బిల్లు’ ఉపసంహరించారు: చంద్రబాబు


అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పాలనా వికేంద్రకరణ గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి మూడు పైసలైనా ఖర్చు చేసిందా? అని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తమ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఈ రెండున్నరేళ్లలో ఏం చేశారు? గత సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు మెజారిటీ స్థానాల్లో వైసీపీని గెలిపించారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో వరదలు వచ్చి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల్లో పెళ్లి విందులు, వినోదాల్లో కాలక్షేపం చేస్తున్నారు. వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. మరో వైపు అసెంబీల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళలను కించపరుస్తూ దుర్భాషలు ఆడటాన్ని కూడా ప్రజలు అసహ్యించుకొంటున్నారు.


వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకొన్నారు’’ అని అన్నారు. వన్‌ టైం సెటిల్మెంట్‌ పేరుతో పేదల నుంచి ప్రభుత్వం బలవంతంగా, సంక్షేమ పథకాలు నిలిపేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తోందని, దానిని అడ్డుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. ‘‘సంక్షేమ పథకాలు నిలిపివేసే హక్కు ఎవరికీ లేదు. ఎవరికైనా ఆపితే వారి తరఫున కోర్టుకు వెళ్దాం. ఒన్‌ టైం సెటిల్మెంట్‌ డబ్బులు చెల్లించాల్సిన అవసరం పేదలకు లేదు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఉచితంగానే ఇళ్లను పేదల పేరుతో రిజిష్టర్‌ చేస్తాం. ఈ విషయం పేదలకు చెప్పండి’’ అని చంద్రబాబు వారితో అన్నారు. 

Updated Date - 2021-11-23T08:42:16+05:30 IST