మందుపైనా మడత

ABN , First Publish Date - 2021-12-19T07:53:05+05:30 IST

మందుపైనా మడత

మందుపైనా మడత

మన రాష్ట్రం.. మన మద్యం

మందు విధానంలోనూ రివర్స్‌

ఏడాదిన్నరలోనే మడమ తిప్పేశారు.. ‘షాక్‌’ కొట్టే ధరలు భారీగా తగ్గింపు

 నాడు.. ‘షాక్‌’ కొట్టేలా ఉండాలన్న జగన్‌

 నేడు..  ధరలు భారీగా తగ్గిస్తూ నిర్ణయం

ఏడాదిన్నర కిందట  75 శాతం పెంపు

ఇప్పుడు సగటున 20 శాతం తగ్గింపు

పొరుగు నుంచి అక్రమ రవాణా ఆగలేదని..

నాటుసారా పెరుగుతోందని సాకులు

మరి... సంపూర్ణ మద్య నిషేధం విధిస్తే?

అది జరగని పని అని ఇప్పుడే సంకేతాలు

ఆదాయం పెంచుకోవడమే అసలు లక్ష్యం?


షాకులు పోయి సాకులు

మద్యం ధరలు వినగానే మందుబాబుల గుండె దడదడలాడాలి. లిక్కర్‌ ధరలు షాక్‌ కొట్టేలా ఉండాలి. అప్పుడే... మద్యం జోలికి వెళ్లరు. వారు ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుంటారు!.. ఏడాదిన్నర కిందట ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన లెక్క ఇది! ఇప్పుడు... మద్యంపై సర్కారు మాట ఒక్కసారిగా తప్పింది. మడమ కూడా తిప్పింది. మద్యం ధరలను సగటున 20 శాతం చొప్పున తగ్గించేసింది.


కాసుల కోసమే కిక్కు

ఈ ఏడాది 30వేల కోట్ల అమ్మకాలు జరిపి... రూ.25వేల కోట్ల ఆదాయం సంపాదించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి ఆరు నెలల్లో రూ.10వేల కోట్లు ఆదాయం వచ్చింది. మిగిలిన ఆరు నెలల్లో మరో రూ.15వేల కోట్ల ఆదాయం రాబట్టాలి. అంటే... అమ్మకాలు పెరగాలి. అందుకే... ధరల తగ్గింపు!


నీరుగారిన నిషేధం...

ఇక... మద్య నిషేధం గురించి మరిచిపోవాల్సిందే! పక్క రాష్ట్రాల నుంచి సరుకు వస్తోందంటూ ధరలు చకచకా తగ్గించేశారు. ‘మరి... సంపూర్ణ మద్య నిషేధం తెస్తే!? పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం... సొంత రాష్ట్రంలో నాటుసారా ప్రవహించవా? అందుకే... మద్య నిషేధం తూచ్‌’ అని ఇప్పుడే చెప్పకనే చెప్పేశారు.(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘మద్యం ధరలు చూస్తే షాక్‌ కొట్టేలా ఉండాలి. సామాన్యుడు మద్యానికి బలి కాకూడదనే తాపత్రయం మాది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇకపై పరిమిత ప్రాంతాల్లోనే మద్యం దొరికేలా చేస్తాం. మరోవైపు పక్క రాష్ర్టాల నుంచి ఎన్‌డీపీఎల్‌ రాకూడదు. రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ చేయకుండా చూడాలి. దీని బాధ్యత ఎస్పీలదే!’’ ఏడాదిన్నర కిందట సీఎం జగన్‌ అన్న మాటలివి! ఆ తర్వాత ఆయన అన్నంతపనీ చేశారు. మద్యం ధరలు భారీగా పెంచేశారు. దీంతో మందుబాబులకు షాక్‌ కొట్టింది. ఆ తర్వాత మెల్లమెల్లగా సీన్‌ మారుతూ వచ్చింది. రెండు నెలల వ్యవధిలోనే పెంచిన ధరలను జగన్‌ సర్కారు కొంత తగ్గించింది. ఆ తర్వాత మరో ఆరు నెలలకు ఇంకొంత తగ్గించింది. శనివారం... ముచ్చటగా మూడోసారి మద్యం ధరలను తగ్గించింది. తాజాగా... సగటున 20శాతం ధరలు తగ్గించింది. ‘ధరలు ఎక్కువగా ఉండటంతో పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. రాష్ట్రంలోనూ సారా తయారవుతోంది. అందుకే... మద్యం ధరలు తగ్గిస్తున్నాం’ అని ప్రభుత్వం తెలిపింది.


పెంచి... దశల వారీగా తగ్గించి

వైసీపీ సర్కారు వచ్చీ రాగానే... మద్యం పాలసీని మార్చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. కొత్త, చెత్త బ్రాండ్లను పరిచయం చేసింది. ధరలను 25శాతం పెంచింది. ఆ తర్వాత... లాక్‌డౌన్‌తో 43 రోజులు మద్యం షాపులు మూతపడ్డాయి. దుకాణాలు తెరవగానే మందుబాబులు ఎగబడ్డారు. దీంతో జగన్‌... అప్పటికప్పుడు అధికారులను పిలిచారు. ఎలాంటి ముందస్తు కసరత్తు చేయకుండానే, ‘ధరలతో షాక్‌ కొట్టాలి’ అంటూ ఏకంగా ధరలను 75శాతం పెంచారు. దీనికి వెనుక ఆదాయం పెంచుకునే వ్యూహం ఉందనే అనుమానాలున్నాయి. అసలే పిచ్చిబ్రాండ్లు, ఆపై భారీ ధరలతో అసలుకే మోసం వచ్చింది. పక్క రాష్ర్టాల నుంచి మద్యం తెచ్చి అమ్ముకోవడం పెరిగిపోయింది. దీంతో... 2నెలల్లోనే 25శాతం ధరలు తగ్గించారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడం, ఆదాయం తగ్గిపోవడంతో 6నెలల్లో మరోసారి అంతేస్థాయిలో ధరలు తగ్గించారు. అయినప్పటికీ... పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ధరలు భారీగా ఉన్నాయి. తెలంగాణ, సరిహద్దు రాష్ర్టాల నుంచి భారీగా ఎన్‌డీపీఎల్‌ రాష్ట్రంలోకి వస్తోంది. ‘‘ఇక లాభంలేదు. ధరలు మరింత తగ్గించాలి. పక్క రాష్ట్రంలో పోల్చితే మరీ ఎక్కువగా ఉండకూడదు. అప్పుడే మన మందు తాగుతారు. ఆదాయం పెరుగుతుంది’’ అనే అంచనాకు వచ్చారు. శనివారం దీనిపై ఆదేశాలు జారీ చేశారు. 


కట్టడి చేయలేక... తాగమంటారా?

‘‘నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ రవాణా ఆగడంలేదు. నాటుసారా తగ్గలేదు. అందుకే మద్యం ధరలు తగ్గిస్తున్నాం’ అని ప్రభుత్వం ఓ కుంటిసాకు వెతుక్కుంది. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత బలోపేతం చేయాలి. నిఘా పెంచాలి. అంతేతప్ప... ధరలు తగ్గించడం ఏమిటి? అని అంతా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా మద్య నిషేధం, నియంత్రణ కబుర్లు చెప్పిన సర్కారు, ఇప్పుడు... ‘మద్యం తాగండి. అది కూడా మనరాష్ట్రంలోనే పన్నులు కట్టి తాగండి’ అనే సందేశం ఇచ్చినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. 


మరి... నిషేధం ఎలా సారూ...

‘దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తాం. ఐదేళ్ల తర్వాత స్టార్‌ హోటళ్లలో మాత్రమే మద్యం అందుబాటులో ఉంటుంది’ అని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఆ తర్వాత... మెల్లమెల్లగా షాపుల సంఖ్యను పెంచుతూ పోయింది. ఇప్పుడు... ధరలు తగ్గించేందుకు చెప్పిన కారణం చూస్తే, మద్యం నిషేధం పూర్తిగా తూచ్‌ అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే... ధరల్లో తేడా ఉన్నందుకే అక్రమ మద్యం వచ్చి పడుతోందని, సారా పెరిగిపోయిందని సర్కారు చెబుతోంది. ‘పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తే ఇంకేమైనా ఉందా! పొరుగు రాష్ట్రం నుంచి ప్రవహిస్తుంది. ఊరూరా సారాబట్టీలు పుడతాయి. అందుకే... మద్యాన్ని నిషేధించలేం’’ అని చెప్పేస్తారన్న మాట! 


తగ్గించిన ధరలు ఇలా... 

మద్యం ధరలని గతంలో రెండు విడతల్లో స్వల్పంగా తగ్గించిన ప్రభుత్వం ఈసారి సగటున 20శాతం తగ్గించింది. ఏ కేటగిరీ మద్యంపై ఎంత తగ్గించారన్నది స్పష్టం చేయకుండా ‘సగటున 20 శాతం’ తగ్గిస్తున్నట్లు తెలిపింది. పేదలు ఎక్కువగా తాగే చీప్‌ లిక్కర్‌పై 20 నుంచి 25శాతం వరకు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మీడియం, ప్రీమియం బ్రాండ్లపై 10 నుంచి 20శాతం తగ్గే వీలుంది. ఇంతగా తగ్గించినప్పటికీ... తెలంగాణకంటే ఏపీలోనే మద్యం ధరలు ఎక్కువ కావడం గమనార్హం. గతంలో మద్యం ధరల్లో వ్యాట్‌ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత ఎక్సైజ్‌ డ్యూటీ, ఏఆర్‌ఈటీ, ఇతరత్రా పన్నులు ఉండేవి. అయితే... ‘అప్పుల వ్యూహం’లో భాగంగా వ్యాట్‌ ఆదాయాన్ని రెండు ముక్కలు చేసింది. వ్యాట్‌ శాతం బాగా తగ్గించి, స్పెషల్‌ మార్జిన్‌ను భారీగా పెంచింది. అందుకోసం పన్నుల సర్దుబాటు పేరుతో నెల రోజుల కిందట జీవోలు జారీ చేసింది. ఇప్పుడు వ్యాట్‌, స్పెషల్‌ మార్జిన్‌, అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీలను కాస్తకాస్త తగ్గించింది. రూ.200లోపు ఉన్న బీరు కేసుపై 40శాతం వ్యాట్‌, వంద శాతం స్పెషల్‌ మార్జిన్‌ ఉంటుందని వివరించింది. రూ.200 కంటే ఎక్కువగా ఉన్న బీరు కేసుపై 40శాతం వ్యాట్‌, 115శాతం స్పెషల్‌ మార్జిన్‌ ఉంటుందని తెలిపింది. తాజా తగ్గింపు తర్వాత కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనేమద్యం ధరలు 10 శాతం వరకు ఎక్కువగా ఉంటాయి.Updated Date - 2021-12-19T07:53:05+05:30 IST