బడ్జెట్‌లో భలే భజన!

ABN , First Publish Date - 2021-05-21T09:32:20+05:30 IST

మండుతూనే సువాసన వెదజల్లే కర్పూరం... వర్షించే మేఘం... తొలకరి చినుకు...

బడ్జెట్‌లో భలే భజన!

ముఖ్యమంత్రిపై పొగడ్తల వర్షం

వర్షించే మేఘం... తొలకరి చినుకు

సున్నితమైన ప్రవర్తన కలవాడు


అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): మండుతూనే సువాసన వెదజల్లే కర్పూరం... వర్షించే మేఘం... తొలకరి చినుకు... ఇంకా, లక్షలమంది పిల్లలకు మేనమామ, అన్నం పెట్టి అవసరాలు తీర్చుతూ వందనాలు అందుకోతగ్గ వాడు, సున్నితమైన ప్రవర్తన కలవాడు!


...బడ్జెట్‌ ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశంసించేందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉపయోగించిన పద విశేషాలు ఇవి! ఇంకా... ఆయన అనేక మంది మహనీయుల మాటలను ఉటంకించారు. వాటిలో కొన్ని ముఖ్యమంత్రికి వర్తింపచేశారు. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగమే ప్రశంసలతో మొదలైంది. మహోన్నత వ్యక్తులు ఓటమి, బాధ, పోరాటం, నష్టం వంటి లోతులన్నింటినీ దాటుకుని వచ్చినవారై ఉంటారు. జీవితంపై ఉన్న అవగాహన, సున్నితంగా స్పందించే తీరు, అభినందించే వ్యక్తిత్వం వారిని సౌమ్యమూర్తులుగా, అపార కరుణా హృదయులుగా చేస్తుంది. మహోన్నత వ్యక్తులు ఊరకనే ఉద్భవించరు’’ అంటూ ఎలిజబెత్‌ కుబ్లెర్‌ రాస్‌ చెప్పారన్నారు. అయితే... ఈ ‘మహోన్నత వ్యక్తి’ ఎవరన్నది నేరుగా చెప్పలేదు. ఆ తర్వాత... ‘గౌరవం కోల్పోయిన జీవితం జీవితమే కాదు. మాట నిలబెట్టుకోలేని మనిషి, మనిషే కాదు’ అంటూ నేరుగా ముఖ్యమంత్రిని కొనియాడారు. ‘మామూలుగాకంటే పైకి ఎదగడం, అంచనాలను అధిగమించడం, వజ్ర సంకల్పం, దృఢనిశ్చయంతో సవాళ్లను ఎదుర్కొవడం’... ఇవన్నీ ముఖ్యమంత్రి లక్షణాలని ప్రశంసించారు. ఇంకా... ఆయా పథకాలు, కేటాయింపుల సందర్భంగా మహనీయుల మాటలను ఉటంకిస్తూ ముఖ్యమంత్రిని పొగుడుతూనే ఉన్నారు. 


సూక్తిముక్తావళి

మహనీయుల మాటలతోపాటు వారిని పరిచయం చేసిన బుగ్గన బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన ఎప్పట్లాగానే పలువురు ప్రముఖుల అమూల్యమైన మాటలను ఉటంకించారు. ఈసారి కొత్తగా వారెవరు, ఏం చేశారు అంటూ... సభకు క్లుప్తంగా పరిచయం కూడా చేశారు. పనిలోపనిగా... ఆయా వ్యాఖ్యలను ముఖ్యమంత్రికి ఆపాదించారు. యోగి వేమన, ఐన్‌స్టీన్‌, మండేలా, జంధ్యాల పాపయ్య శాస్త్రి, పాలో కోయిలో వంటి రచయితలు, నేతల మాటలను చెబుతూ... వారి గొప్పతనాన్ని కూడా వివరించారు. బడ్జెట్‌లో బుగ్గన వినిపించిన సూక్తి ముక్తావళి ఇది...


పిల్లలను మీ సొంత శిక్షణ అవసరాలకు పరిమితం చేయవద్దు, వారు జన్మించిన కాలం వేరు.

- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌


మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు.                    

- స్వామి వివేకానంద


మహిళలను అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు.  అభివృద్ధికే మహిళల సహకారం అవసరం!- కోఫీ అన్నన్‌ న్యాయ- అన్యాయాల అంతరం లేకుండా వర్షం అందరిపై సమంగా కురిసినట్టుగానే, మీ వాత్సల్యమును కూడా అందరిపై సమానంగా చూపండి!

- గౌతమ బుద్ధుడు


ఇహమునందు బుట్టి ఇంగితమెరుగని జనుల నెంచిచూడ స్థావరములు. జంగమాదులనుట జగతిని పాపము విశ్వదాభిరామ వినురవేమ!

- వేమన


ప్రపంచాన్ని మార్చటానికి మీరు ఉపయోగించగలిగిన అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య!

- నెల్సన్‌ మండేలా


విద్య అంటే విషయాలను బట్టీ పట్టడమే కాదు, మనస్సును ఆలోచింపచేసే దిశగా శిక్షణ.

- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌


దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు. భ్రాతృ జనము వచ్చి పంచుకోరు.. విశ్వవర్థనంబు విద్యాధనంబురా.. లలిత సుగుణాల తెలుగుబాల!

- జంధ్యాల పాపయ్యశాస్ర్తి


పాతరాతి యుగం నుంచి!

ఆర్థిక మంత్రి బుగ్గన ‘చరిత్ర’ అధ్యాపకుడిగా మారారు. తన బడ్జెట్‌ ప్రసంగంలో మూడు పేజీలు హిస్టరీకి కేటాయించేశారు.  క్రీస్తు పూర్వం 3,500 సంవత్సరాల వెనక్కి, సింధూ నాగరికత వరకు వెళ్లారు. ఆ తర్వాత... 1వ శతాబ్దం నుంచి 17 శతాబ్దానికి వచ్చారు. అలా శతాబ్దాలపాటు ఆర్థిక శక్తిగా విలసిల్లిన భారత్‌... ఆ తర్వాత బ్రిటిష్‌ పాలనలో వెనకబడిపోయిందని చెప్పారు. తాజా ‘కొవిడ్‌ సంక్షోభం’ గురించి ప్రస్తావిస్తూ... ‘‘మానవ చరిత్రలో 2020 ఒక మైలురాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 780 కోట్ల మంది ఒక ఉమ్మడి శత్రువుతో పోరాటం చేస్తున్నారు. ఎన్నో ప్రాణాలు పోతున్నా, చీకటి మేఘాలు కమ్ముకుంటున్నా, ప్రభుత్వాలు, ప్రయోగశాలలు, శాస్త్రవేత్తలు, పరిశోధకుల నిరంతర కృషి మానవ జాతి మనుగడను ఏకీకృతం చేసింది’’ అని తెలిపారు. ఏపీ డెయిరీని ‘అమూల్‌’కు అప్పగిస్తున్న వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఆర్థిక మంత్రి బుగ్గన ‘అమూల్‌’ మూలాల్లోకి వెళ్లి, ఆ సంస్థ ఎక్కడ, ఎలా పుట్టిందో వివరిస్తూ... దాని ఘనతను ఎంతగానో కొనియాడారు. .

Updated Date - 2021-05-21T09:32:20+05:30 IST