ఐ.టీ పాలసీకి తుది మెరుగులు: మంత్రి మేకపాటి

ABN , First Publish Date - 2021-06-21T21:58:52+05:30 IST

ఐ.టీ పాలసీకి తుది మెరుగులు దిద్దుతామని ఇటీవలే ఈ అంశానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పాలసీ విడుదల చేశామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.

ఐ.టీ పాలసీకి తుది మెరుగులు: మంత్రి మేకపాటి

అమరావతి: ఐ.టీ పాలసీకి తుది మెరుగులు దిద్దుతామని ఇటీవలే ఈ అంశానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పాలసీ విడుదల చేశామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. సోమవారం విజయవాడ ఆర్ అండ్ భవనంలోని ఏపీటీఎస్ కార్యాలయంలో  ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో ఐ.టీ పాలసీలో తుది మెరుగులపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి , ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ , ఐ.టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సుందర్, జాయింట్ సెక్రెటరీ నాగరాజు పాల్గొన్నారు.  ఈ భేటీ ముగిసిన అనంతరం మంత్రి మేకపాటి  మీడియాతో మాట్లాడుతూ.. 24వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం ఉంటుందని ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం ఐ.టీ పాలసీ విడుదలపై స్పష్టతవస్తుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. 


‘వర్క్ ఫ్రం హోం'పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ‘వర్క్ ఫ్రం హోం' అమల్లో అవసరమైన వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఐ.టీ పాలసీ ద్వారా కంపెనీలకి అందించే ప్రోత్సాహకాలను ఏ విధంగా అందించాలన్న అంశం పైనా కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో ఐ.టీ ఉద్యోగుల వివరాలపై ప్రత్యేక సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. వలంటీర్ల ద్వారా సర్వే పూర్తి చేయడానికి దిశానిర్దేశం చేస్తామన్నారు. ఈ సర్వే ద్వారా  రాష్ట్రస్థాయిలో ఎంతమంది ఐ.టీ ఉద్యోగులున్నారనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు. 0.3 శాతం ఉన్న ఐ.టీ వృద్ధిని 5 శాతానికి చేర్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-06-21T21:58:52+05:30 IST