కదంతొక్కిన కార్మికులు
ABN , First Publish Date - 2021-02-06T08:22:02+05:30 IST
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్లాంట్ ఆర్చ్ నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

- ప్రైవేటీకరణను నిరసిస్తూ భారీ ర్యాలీ
- కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం
- ఉక్కు అధికారుల సంఘం ప్రకటన
ఉక్కుటౌన్‌షిప్ (విశాఖపట్నం), ఫిబ్రవరి 5: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్లాంట్ ఆర్చ్ నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వారికి పలు పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి రావడంతో వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ దేశంలోనే నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం కార్పొరేట్‌లకు అప్పగించేందుకు చూస్తోందని, రూ.లక్షల కోట్ల విలువైన ప్లాంట్‌ను కారుచౌకగా అమ్మేందుకు యత్నిస్తోందన్నారు. ఎంతోమంది త్యాగధనుల పోరాటాల ఫలితంగా ఏర్పడిన స్టీల్‌ప్లాంట్ జోలికి వస్తే మరో ఉద్యమం చేస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.