ఫైబర్‌ నెట్‌ కేసు సీఐడీకి

ABN , First Publish Date - 2021-07-12T07:50:40+05:30 IST

ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసుపై సీఐడీ విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది.

ఫైబర్‌ నెట్‌ కేసు  సీఐడీకి

గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపణ

దర్యాప్తు చేయాలని నిరుడు సీబీఐకి జగన్‌ ప్రభుత్వం లేఖ

ఆ సంస్థ స్పందించకపోవడంతో తాజాగా సీఐడీకి అప్పగింత


అమరావతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసుపై సీఐడీ విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఫైబర్‌ నెట్‌ ఎండీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. టెండర్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పిలిచిన రూ.1,410కోట్ల విలువైన టెండర్లలో మార్గదర్శకాలు ఉల్లంఘించి కాంట్రాక్టరుకు మేలు చేశారంటూ వైసీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలు పలుమార్లు విమర్శలు చేశారు. టెలికమ్యూనికేషన్స్‌ విభాగం, భారత్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌(బీబీఎన్‌ఎల్‌-2) మధ్య అవగాహనలో.. చంద్రబాబు ప్రభుత్వం కాంపోనెంట్‌ వ్యయా న్ని పెంచి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నాటి ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరికృష్ణప్రసాద్‌ టెండర్ల కమిటీలో ఉంటూ కీలకపాత్ర పోషించారని తెలిపారు. టెండరు నిబంధనలు అతిక్రమించి తేరా సాఫ్ట్‌వేర్‌ సంస్థకు అవకాశం కల్పించారని.. 11.26ు ఎక్కువ కోట్‌ చేశారని జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఎత్తిచూపింది.


సహ బిడ్డర్లు టెండర్‌ ప్రక్రియపై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ గత ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంది. ప్రాజెక్టు మానిటరింగ్‌ ఏజెన్సీ పనిని జెమిని కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ కు సరైన అర్హత లేకున్నా నిబంధనలు అతిక్రమించి ఇచ్చారని తెలిపింది. టెండర్ల విషయంలో వివక్ష చూపారంటూ డసన్‌ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ విచారణకు జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. గత సెప్టెంబరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి సీబీఐకి లేఖ రాసింది. సీబీఐ కేసు విచారణకు స్వీకరించకపోవడంతో సీఐడీకి దర్యాప్తు బాధ్యత అప్పగించింది. విచారణ తర్వాత నివేదిక ఇవ్వాలని సీఐడీ ఏడీజీని ఆదేశించింది.

Updated Date - 2021-07-12T07:50:40+05:30 IST