ఏంట్రా నీ పేరు..యూజ్‌లెస్‌ఫెలో!

ABN , First Publish Date - 2021-09-03T09:44:55+05:30 IST

ఏంటమ్మా, ఏంట్రా, యూజ్‌లెస్‌ ఫెలో, బ్లడీ జోకర్‌, యూజ్‌లెస్‌ గైస్‌....

ఏంట్రా నీ పేరు..యూజ్‌లెస్‌ఫెలో!

  • కథలు చెప్పొద్దు.. ఏం చేస్తున్నావ్‌ రా?
  • సస్పెండ్‌ చేసేస్తా జాగ్రత్త!తహసీల్దార్లపై పశ్చిమ కలెక్టర్‌ 
  • పరుష పదజాలం టీకాపై టెలీకాన్ఫరెన్స్‌లో ఫైర్‌


ఏలూరు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఏంటమ్మా, ఏంట్రా, యూజ్‌లెస్‌ ఫెలో, బ్లడీ జోకర్‌, యూజ్‌లెస్‌ గైస్‌.... ఒక జిల్లా కలెక్టర్‌ మండల తహసిల్దార్లపై విరుచుకుపడిన వైనం ఇది! టెలీకాన్ఫరెన్స్‌లో ఒక్కో తహసిల్దార్‌ను తిట్టిపోస్తూ, నిలదీస్తూ సాగిన ఈ సంభాషణ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా తిట్టిపోసింది పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా! మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఆయన వివిధ మండలాల తహసిల్దార్లతో కరోనా వ్యాక్సినేషన్‌పై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆరోజు వచ్చిన స్టాక్‌ను ఎంత వినియోగించారు... ఇంకా ఎంత పెండింగ్‌లో ఉందనే అంశంపై ఒక్కో తహసిల్దార్‌ను లైన్‌లోకి తీసుకుని ప్రశ్నించారు. ఎక్కువ పెండింగ్‌లో ఉన్న అధికారులను ఉద్దేశించి తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తూ... అనుచితమైన పదజాలంతో దూషించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యలమంచిలి, ఆకివీడు, వీరవాసరం, నిడదవోలు తదితర మండలాల తహసిల్దార్లతో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మాట్లాడారు. గంటలో పెండింగ్‌ క్లియర్‌  కావాలంటూ ఒక్కొక్కరికి అల్టిమేటమ్‌ జారీ చేశారు. ‘‘ఏంటమ్మా... ఏం చేస్తున్నావ్‌ స్వామీ? మీతో ఆర్డీవో, జేసీ, చివరికి నేను కూడా మాట్లాడాలా?’’ అని ఒక తహసిల్దార్‌ను ప్రశ్నించారు. ‘ఎంత లేట్‌ అయినా చేస్తాను సర్‌’ అని ఒక తహసిల్దార్‌ చెప్పగా... ‘‘ఎంత లేట్‌ అయినా ఏంట్రా! మాకు ఏమైనా ఫేవర్‌ చేస్తున్నావా?’’ అని గద్దించారు. 


ఎంత స్టాక్‌ వచ్చిందనే ప్రశ్నకు ఆ తహసిల్దార్‌ బదులివ్వలేకపోయారు. ‘పౌర సరఫరాల గోడౌన్‌ వద్ద లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లమ్‌ వచ్చింది. అక్కడ ఉన్నానుసార్‌’ అని చెప్పగా... ‘‘నేను కలెక్టర్‌ను అని మరిచిపోవద్దు. గోడౌన్‌ వద్ద ఏం జరిగిందో నాకు తెలియదనుకుంటున్నావా? ఎంత స్టాక్‌ వచ్చిందో చెప్పు! సస్పెండ్‌ అవుతావా? నీ పేరు ఏంట్రా బాబూ’’ అని కలెక్టర్‌ మండిపడ్డారు. ఇక... మరో తహసిల్దారును ‘ఏంటమ్మా.. నువ్వు ఏం చేస్తున్నావు? నిన్ను రిక్వెస్ట్‌ చేయాలా! యూజ్‌లెస్‌ ఫెలో’ అని తిట్టారు. ‘చేయించేస్తాను సార్‌’ అని ఆ తహసిల్దార్‌ బదులివ్వగా... ‘‘చేయించేస్తాను ఏంది! అదేం భాషరా!  బ్లడీఫెలో! నేను అర్జీ పెట్టుకున్నానా? ఏం టోన్‌లో మాట్లాడుతున్నావు? యూజ్‌లెస్‌ ఫెలో’’ అని విరుచుకుపడ్డారు. కొంత మేరకే పెండింగ్‌లో ఉన్నాయని, పూర్తి చేస్తామని మరో తహసిల్దార్‌ చెప్పగా... ‘‘కథలు చెప్పవద్దు.  గంటలో మొత్తం చేయాలి’’ అని హెచ్చరించారు. ఇక... ఇన్‌చార్జిగా ఉన్న ఒక డిప్యూటీ తహసిల్దార్‌ను కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మరింత తీవ్రంగా తిట్టారు. ‘తహసిల్దార్‌ పోస్టుకోసం పైరవీలు చేస్తున్నది నువ్వే కదా?’ అన్నారు. ‘హూ ఈజ్‌ దిస్‌ ఫెలో! నీపేరు ఏంట్రా? బ్లడీ ఫెలో! నువ్వు ఒక పని చేయలేవు. పోస్టింగ్‌ కోసం కలెక్టర్‌పైన ఒత్తిడి తెస్తావా? యూజ్‌లెస్‌ ఫెలో, బ్లడీ జోకర్‌! రేపు సాయత్రానికి ఏం జరుగుతుందో చూడు!’’ అని హెచ్చరించారు. 


అది ధైర్యాన్నిచ్చి..ఆప్యాయంగా మాట్లాడటమేనట! 

తహసిల్దార్లను అవమానించడంపై ఏపీరెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు..కలెక్టర్‌ను కలిసి చర్చించారు. ఉద్యోగులు పనిచేసేందుకు ధైర్యాన్నిచ్చి, ఆప్యాయంగా మాట్లాడిన మాటలే తప్ప దురుద్దేశపూర్వక భావనలు ఏమి లేవని కలెక్టర్‌ అన్నట్లు సంఘం అధ్యక్షుడు కె.రమేశ్‌ కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2021-09-03T09:44:55+05:30 IST