ఢిల్లీ వాళ్లొస్తున్నారు... జాగ్రత్త!

ABN , First Publish Date - 2021-08-21T07:46:09+05:30 IST

ఉపాధి పనులపై కేంద్ర అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడిన రాష్ట్ర యంత్రాంగం...

ఢిల్లీ వాళ్లొస్తున్నారు... జాగ్రత్త!

‘ఉపాధి’ లోపాలపై రాష్ట్రం అప్రమత్తం

వచ్చేవారం కేంద్ర అధికారుల రాక

ఆరు జిల్లాల్లో పనుల పరిశీలన

రాష్ట్ర యంత్రాంగం అలర్ట్‌

‘అధిక పనుల’పై తనిఖీల్లో

చిక్కకుండా జాగ్రత్తలు

‘ఉపాధి’ నిర్మాణాలకు వైఎస్‌, 

జగన్‌ పేర్లు తొలగింపు

ఎమ్మెల్యేల సిఫారసులతో 

చేపట్టిన పనులన్నీ రద్దు

(అమరావతి- ఆంధ్రజ్యోతి): ఉపాధి పనులపై కేంద్ర అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడిన రాష్ట్ర యంత్రాంగం... కేంద్ర తనిఖీల్లో ‘తప్పులు’ దొరక్కుండా ముందు జాగ్రత్త పడుతోంది. వచ్చే వారం కేంద్ర అధికారులు ఉపాధి హామీ పథకం పనుల తనిఖీ కోసం వస్తుండటంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర అధికారులు సందర్శించనున్న జిల్లాలకు ఇప్పటికే గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరేట్‌ అధికారుల బృందాలను పంపించారు. వారం కిందట జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర అధికారులు ప్రస్తావించిన, నిలదీసిన అంశాల విషయంలో ‘దొరికిపోకుండా’ జాగ్రత్త పడుతున్నారు. ‘4నెలల్లో 20కోట్ల పనిదినాలు ఎలా కల్పించారు? ఇది ఎలా సాధ్యమైంది? ఇది నిజమేనా... లేక కాగితాల్లో రాసేశారా?’ అని కేంద్ర అధికారులు నిలదీశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిసింది. పనిదినాలు ఎక్కువగా నమోదైన మండలాల్లో ముందస్తుగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించడంతో శుక్రవారం సెలవు దినం అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉపాధి అధికారులు పరిశీలించారు. ఇబ్బందికర పరిస్థితులున్న చోట ఎలా సరిదిద్దుకోవాలో సూచనలు చేస్తున్నారు. పలు గ్రామాల్లో పనుల మస్టర్లను తనిఖీ చేస్తున్నారు.


వైఎ్‌సఆర్‌, జగనన్న పేర్లను మార్చండి

కేంద్రం వాటా నిధులతో అమలవుతున్న పథకాలకూ రాష్ట్రంలో ‘వైఎస్సార్‌, జగనన్న’ పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఉపాధి హామీ నిధులను కేంద్రం 75శాతానికిపైగా భరిస్తోంది. ఈ పథకాన్ని పంచాయతీరాజ్‌, వ్యవసాయ, వైద్య ఆరోగ్యం, ఇతర శాఖలతో అనుసంధానించి రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు నిర్మిస్తున్నారు. అయినప్పటికీ... వీటి నిర్మాణంలో కేంద్రం పాత్రను ప్రజలకు తెలియచేయడం లేదు. కేంద్ర అధికారుల తనిఖీ నేపథ్యంలో దీనిపై దృష్టిసారించారు. ‘వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌’ల పేరును ‘భారత్‌ నిర్మాణ్‌ సేవా కేంద్రాలు’గా మార్చాలని ఆదేశించారు. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల పేర్లను ‘అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ స్టోరేజ్‌ బిల్డింగ్‌’గా మార్చాలని స్పష్టం చేశారు. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకూ జగన్‌, వైఎస్‌ పేర్లను పెట్టడంపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 


నేతల ‘పనులు’ రద్దు

ఎమ్మెల్యేల సిఫారసులతో ఉపాధి పనులు మంజూరు చేయడం, వాటికి బిల్లులు చెల్లించడంపైనా వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర అధికారులు మండిపడ్డారు. ఇది చట్టవిరుద్ధం కాదా అని నిలదీశారు. ఈ అంశంపై రాష్ట్ర అధికారులు అదేరోజు స్పందించారు. సర్పంచ్‌లస్థానంలో ప్రత్యేకాధికారులు ఉన్న సమయంలో ప్రజాప్రతినిధుల సిఫారసులతో మంజూరైన పనులన్నీ రద్దు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ కలెక్టర్లకు అదేరోజు లేఖలు రాశారు. గత ఏడాది డిసెంబర్‌ 16 తర్వాత పనులు మంజూరయ్యాయో లేదో పరిశీలించాలని డ్వామా పీడీలకు సూచించారు. గతంలో మంజూరైన పనులకు కూడా గ్రామసభ తీర్మానాలు ఉన్నాయో, లేవో పరిశీలించాలని డ్వామా పీడీలను ఆదేశించారు. గత ఏడాది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్ల విలువైన ఉపాధి పనులు మంజూరుచేస్తామని, ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఎమ్మెల్యేల సిఫారసులతో పలు పనులు మంజూరుచేశారు. నిజానికి ఉపాధి హామీ పథకం చట్టం సెక్షన్‌ 13 ప్రకారం ఆ పనులన్నింటికీ గ్రామసభ ఆమోదం ఉండాలి. నేతల సిఫారసులతో పనులు చేపట్టడం కుదరదు. ఇప్పుడు... ప్రత్యేకాధికారులతో గ్రామ సభలు నిర్వహించి పనులకు తీర్మానం చేసినట్లు కొందరు వైసీపీ నేతలు పాత తేదీలతో తీర్మానం ప్రతులను సమర్పిస్తున్నారు. వీటిని ఆమోదించాల్సిందిగా ప్రత్యేకాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 


తనిఖీలు ఇలా... 

వచ్చే మంగళవారం కృష్ణా, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరితోపాటు మరో రెండు జిల్లాల్లో కేంద్రం బృందం పర్యటిస్తుంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో చేపట్టిన లేబర్‌, మెటీరియల్‌ పనులను పరిశీలిస్తుంది. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ను అన్ని రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారు. ఏపీ మాత్రమే టీసీఎస్‌ సాప్ట్‌వేర్‌ను వినియోగిస్తోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఎన్నిసార్లు ఆదేశించినా పాత సాఫ్ట్‌వేర్‌నే మార్చకపోవడంలో ఏదైనా మతలబు ఉందా? అనే అంశంపైనా కేంద్ర అధికారులు దృష్టి సారించనున్నారు. అలాగే... నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పనులను పరిశీలించనున్నారు. ఉదాహరణకు... రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో స్థలాలు చదును చేసేందుకు రూ.1069 కోట్ల ఉపాధి నిధులు ఖర్చుపెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధం!

Updated Date - 2021-08-21T07:46:09+05:30 IST