‘ఉపాధి’పై కేంద్రం నజర్‌

ABN , First Publish Date - 2021-08-20T07:42:50+05:30 IST

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులను తనిఖీ చేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వచ్చే వారం రాష్ట్రానికి రానున్నారు.

‘ఉపాధి’పై కేంద్రం నజర్‌

వచ్చే వారం రాష్ట్రంలో పనుల తనిఖీ

గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల రాక

ఆరు జిల్లాల్లో పనుల పరిశీలన

గతంలో అవకతవకలపై అనుమానాలు

గుట్టు రట్టు చేయాలన్న యోచనలో కేంద్రం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులను తనిఖీ చేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వచ్చే వారం రాష్ట్రానికి రానున్నారు. వచ్చే మంగళవారం ఆరు జిల్లాల్లో  కేంద్ర బృందం పర్యటించి ఉపాధి పనులు జరుగుతున్న తీరును పరిశీలించనున్నట్లు తెలిసింది. గత శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్‌ సెక్రటరీ రోహిత్‌ కుమార్‌ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా.. ఉపాధి పనుల్లో అవకతవకలపై అనుమానం వ్యక్తం చేసిన విషయం విదితమే. గత రెండేళ్లుగా రాష్ట్రంలో చేపట్టిన లేబర్‌, మెటీరియల్‌ పనులను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో సహా మొత్తం ఆరు జిల్లాల్లో కేంద్ర బృందం తనిఖీ చేయనుంది. నాలుగు నెలల సమయంలో 20 కోట్ల పనిదినాలు ఎలా కల్పించగలిగారన్న దానిపై కేంద్ర అధికారులు ఇప్పటికే పలు దఫాలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ను అన్ని రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారు. తెలంగాణ కూడా గత ఏడాది నుంచి ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తోంది. ఏపీ మాత్రమే టీసీఎస్‌ సాప్ట్‌వేర్‌ను వినియోగిస్తోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఎన్నిసార్లు ఆదేశించినా ఏపీ సర్కారు పట్టించుకోకపోవడంతో సాఫ్ట్‌వేర్‌లో ఏదో మతలబు చేసి వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారన్న అనుమానాలు కేంద్ర అధికారుల్లో ఏర్పడినట్లు సమాచారం. పైగా ఉపాధి చట్టానికి విరుద్ధంగా పనిదినాలు లెక్కిస్తున్నారని, దాని గుట్టు రట్టు చేయాలన్న యోచనలో కేంద్ర అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.


గత రెండేళ్లలో చేపట్టిన పనులు ఉపాధి హామీ పథకంలో అనుమతించినవా? కాదా? అనే దానిపై ఆరా తీయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల నిర్మాణమంటూ చేపట్టి ఆ స్థలాల లెవలింగ్‌ పనులను ఉపాధి నిధులతో చేపట్టారు. వాస్తవానికి ఉపాధి హామీ పథకంలో కాలనీల లెవలింగ్‌ పనులకు అనుమతి లేదు. అయితే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా సుమారు రూ.1069 కోట్లు ఉపాధి నిధులు ఆ పనులకు వాడేశారు. పైగా వేగవంతంగా చేయాలనే ఉద్దేశంతో వైసీపీ కార్యకర్తలకు పనులు అప్పగించి మెషిన్లతో కూడా చేపట్టారు. గ్రామాల్లో ఉన్న చెరువులు, పంచాయతీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. ఒక్కపైసా సెస్‌ చార్జీలు చెల్లించకుండా యథేచ్ఛగా మట్టి దోపిడీ చేసినా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ సర్క్యులర్‌ ఇచ్చి సరిపెట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పనులన్నింటికీ బిల్లులు చేయించుకున్నారు. వేబిల్లులు లేకుంటే బిల్లులు చేయొద్దని సిబ్బందికి ఇచ్చిన ఆదేశాలు పట్టించుకున్న దాఖలాల్లేవు. కాగా గత ప్రభుత్వం చేపట్టిన పనులను గత ఏడాది కరోనా సమయంలోనూ తనిఖీలు చేసిన సోషల్‌ ఆడిట్‌ విభాగం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తనిఖీలు నిలిపేసింది. కరోనా కారణంగా సోషల్‌ ఆడిట్‌  తనిఖీలు నిలిపేశామని వాళ్లు చెప్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఒత్తిడితోనే సోషల్‌ ఆడిట్‌ విభాగం తనిఖీలు చేయడం లేదని తెలుస్తోంది. సోషల్‌ ఆడిట్‌ తనిఖీల్లో చట్ట విరుద్ధమైన పనులకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని, దీంతో ఇబ్బందులొస్తాయనే తనిఖీలు చేపట్టలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం తనిఖీలకు వస్తోంది. 

Updated Date - 2021-08-20T07:42:50+05:30 IST