వలంటీర్లు, డీలర్ల వద్దా ఈకేవైసీ

ABN , First Publish Date - 2021-08-20T08:12:57+05:30 IST

ఈ-కేవైసీ ప్రక్రియ... బియ్యం కార్డులను తొలగించేందుకు కాదని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ స్పష్టం చేశారు.

వలంటీర్లు, డీలర్ల వద్దా ఈకేవైసీ

ఐదేళ్లలోపు పిల్లలకు అక్కర్లేదు

5-15 ఏళ్లవారికి వచ్చే నెలాఖరు వరకు

అవసరాన్ని బట్టి గడువు పొడిగింపు

ఈకేవైసీ.. కార్డుల తొలగింపునకు కాదు

దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్‌ తీసుకోవటానికే

పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ శశిధర్‌ ప్రకటన


అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఈ-కేవైసీ ప్రక్రియ... బియ్యం కార్డులను తొలగించేందుకు కాదని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ స్పష్టం చేశారు. రేషన్‌ కార్డుదారులు దేశంలో ఎక్కడి నుంచైనా నిత్యావసర సరుకులు తీసుకునేందుకే ఈ ప్రక్రియ చేపట్టామని, రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. బియ్యం కార్డుల రద్దుపై అనుమానాలు వద్దని స్పష్టం చేశారు. ఈకేవైసీ కోసం ఆధార్‌ కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదని, గ్రామ, వార్డు వలంటీర్ల వద్ద ఉన్న బయోమెట్రిక్‌ యంత్రంలోను, రేషన్‌ డీలర్‌ వద్ద ఉండే ఈ-పోస్‌ యంత్రం ద్వారా సులభంగా ఈ-కేవైసీ చేయించుకోవచ్చని తెలిపారు. ఈ-కేవైసీ అంటే రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్‌ యంత్రం ద్వారా వేలిముద్రలతో ఆధార్‌ నంబర్‌ను ధ్రువీకరించుకునే ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు. వేలి ముద్రలు సరిగాపడనివారు చౌక డిపోలోని ఈపోస్‌ యంత్రం ద్వారా ఫ్యూజన్‌ ఫింగర్‌ సదుపాయాన్ని వినియోగించుకుని ఈ-కేవైసీ చేసుకోవచ్చన్నారు.


ఈకేవైసీ ఫెయిల్‌ అయినవారు, ఇంతకుముందు బయోమెట్రిక్‌లో రికార్డు కాని వారు మాత్రమే ఆధార్‌ కేంద్రాల వద్ద ఈ-కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఈ-కేవైసీ అవసరం లేదని, 5-15 ఏళ్ల వారికి సెప్టెంబరు నెలాఖరులోపు, మిగిలినవారు ఈనెలాఖరులోపు ఈ-కేవైసీ చేయించుకోవాలన్నారు. అవసరాన్ని బట్టి గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను ఆధార్‌ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు కమిషనర్‌ తెలిపారు.

Updated Date - 2021-08-20T08:12:57+05:30 IST