మిర్చిని మింగేసిన ‘తామర’

ABN , First Publish Date - 2021-12-30T08:37:49+05:30 IST

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన అంగజాల కాశీరాజ్‌ ఎకరానికి రూ.30 వేలు చొప్పున చెల్లించి.. ఏడు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు.

మిర్చిని మింగేసిన ‘తామర’

  • ఏపుగా ఎదిగి.. గిడసబారిన తోటలు
  • లక్షలు పెట్టుబడి పెట్టి.. నష్టపోయిన రైతులు
  • కన్నెత్తి చూడని వ్యవసాయ శాఖ అధికారులు
  • ప్రభుత్వమే ఆదుకోవాలని రైతుల విన్నపాలు


కంచికచర్ల, డిసెంబరు 29: కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన అంగజాల కాశీరాజ్‌ ఎకరానికి రూ.30 వేలు చొప్పున చెల్లించి.. ఏడు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. దానిలో ఆర్మూర్‌, తేజ రకాల మిర్చిని సాగు చేశాడు. తోటలు పట్టెలు కమ్ముకుని, పూతకు దిగుతున్న తరుణంలో నల్ల తామర పురుగు ఆశించింది. పురుగు నివారణకు ఆర్గానిక్‌ మందులు కొట్టాడు. ఖర్చు పెరిగింది కానీ.. తోట తిప్పుకున్నది లేదు. కళ్ల ముందే తోటలు గిడసబారిపోయాయి. దిక్కుతోచని స్థితిలో తోటలను ట్రాక్టరుతో దున్నేశాడు. పెట్టుబడుల రూపేణా ఏడు లక్షలు నష్టపోయి.. దికుతోచని స్థితిలో ఉన్నాడు. మిర్చి రైతును తామర పురుగు కాటేసింది. ఏపుగా ఎదిగిన తోటలు గిడసబారి... దిగుబడి రాకపోవడంతో రైతులు రూ.లక్షలు నష్టపోయారు. కృష్ణా జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగుచేశారు. ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. మొక్క ఏపుగా ఎదిగి.. పచ్చగా కళకళలాడింది. పంట బాగుందని.. ఈ ఏడాది లాభాలు కళ్లజూడొచ్చని రైతులు ఆశిస్తున్న తరుణంలో నవంబరు నెలలో ఉపద్రవం వచ్చిపడింది. మిర్చి మొక్కలపై తామరపురుగు దాడి చేసింది. కొద్ది రోజుల్లోనే పురుగు దాడి ఉధృతమై.. చూస్తుండగానే మొక్కలోని రసం మొత్తాన్ని పీల్చేశాయి. ఎన్ని రకాల క్రిమిసంహారక మందులు వాడినా అదుపులోకి రాలేదు. కొందరు ఆర్గానిక్‌ మందులు వాడారు. ఇంకొందరు సరికొత్త ప్రయోగాలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పురుగు దాడితో తోటలు గిడసబారిపోయాయి. ఇక చేసేది లేక రైతులు తోటలను తొలగించేస్తున్నారు.  రైతులకు ఇంతనష్టం వాటిల్లినా.. వ్యవసాయ శాఖ అధికారులు తోటలవైపు కన్నెత్తి చూడలేదని రైతులు వాపోతున్నారు. తమకు జరిగిన నష్టంపై ప్రభుత్వం తక్షణమే సర్వే జరిపించి, నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.


తోటలు నాశనమయ్యాయి

రెండు ఎకరాల్లో మిర్చి వేశాను. ఎకరానికి 1.25 లక్షలు ఖర్చయ్యింది. తామర పురుగు, ఎర్ర నల్లి, నల్లనల్లి, బొబ్బర తెగుళ్లు దాడి చేశాయి. ఎన్ని రకాల మందులు పిచికారి చేసినా ఉపయోగం కనిపించలేదు. పూత రాలిపోయి, తోటలు గిడసబారిపోయాయి. 

-  మల్లెల రామారావు, పెద్దాపురం


ప్రభుత్వమే ఆదుకోవాలి

రెండు ఎకరాల్లో మిర్చి వేశాను. రెండు లక్షలకుపైగా ఖర్చయ్యింది. పురుగు అదుపులోకి రాకపోవటంతో తోట తీసేశాను. గతంలో ఎన్నడూ లేనివిధంగా నష్టపోయాను. బాధిత రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.  

 - శీలం కృష్ణయ్య,పెనుగంచిప్రోలు

Updated Date - 2021-12-30T08:37:49+05:30 IST