ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం గుంతను.. ఇసుకతో నింపేయండి

ABN , First Publish Date - 2021-03-24T09:44:42+05:30 IST

గోదావరి నదిలో భారీగా పోటెత్తిన వరద (23 లక్షల క్యూసెక్కులు)కు పోలవరం ప్రాజెక్టు ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం (ఈసీఆర్‌ఎఫ్‌) వద్ద ఏర్పడిన భారీ గుంతను ఇసుకతో పూడ్చేయాలని డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం గుంతను.. ఇసుకతో నింపేయండి

కాంక్రీటు వేస్తే ఖర్చు.. అధిక సమయం

జలవనరుల శాఖకు డీడీఆర్‌పీ ఆదేశం


అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదిలో భారీగా పోటెత్తిన వరద (23 లక్షల క్యూసెక్కులు)కు పోలవరం ప్రాజెక్టు ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం (ఈసీఆర్‌ఎఫ్‌) వద్ద ఏర్పడిన భారీ గుంతను ఇసుకతో పూడ్చేయాలని డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్‌పీ) ఆదేశించింది. కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని ఈ డీడీఆర్‌పీ చైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, భార్గవ, శ్రీనివాస్‌ తదితరులు మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకరబాబు, ఎస్‌ఈ (క్వాలిటీ కంట్రోల్‌) సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం వద్ద ఏర్పడిన పెద్ద గుంతను ఇసుకతో పూడ్చడం వల్ల సహజమైన గట్టిదనం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.


దీనిని కాంక్రీట్‌తో మూసివేయాలని అనుకున్నప్పటికీ.. 9 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వేయాలంటే ఖర్చు, సమయమూ తీసుకుంటాయని భావించారు. దీంతో సహజమైన ఇసుకతో నింపడమే సహేతుక చర్యగా డీడీఆర్‌పీ పేర్కొంది. అదేవిధంగా గేట్లకు సంబంధించి 48వ గేట్‌ వద్ద టునియన్‌ గడ్డర్లకు ఎదురైన సమస్యను గ్రౌటింగ్‌తో పరిష్కరించవచ్చని..అక్కడ ఏర్పాటు చేసిన ప్లేట్లను కొంచెం పెద్దవిగా ఉండేలా చేయాలని సూచించింది. అప్రోచ్‌ చానల్‌ను 450 మీటర్లకు పైబడి నిర్మిస్తేనే ప్రాజెక్టుకు భద్రత ఉంటుందని.. 500 నుంచి 600 మీటర్ల వెడల్పులో నిర్మించడం వల్ల ప్రాజెక్టుకు మరింత భద్రత ఉంటుందని అభిప్రాయపడింది.

Updated Date - 2021-03-24T09:44:42+05:30 IST