పదవులకు పనికిరామా?
ABN , First Publish Date - 2021-10-21T11:08:13+05:30 IST
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిస్తే, అధికారంలోకి వచ్చాక పదవుల పంపిణీలో తమకు మొండిచేయి చూపారని దూదేకుల కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతిచ్చాం
- పదవుల కేటాయింపులో మొండిచేయి
- న్యాయం చేయకుంటే ఉద్యమిస్తాం
- దూదేకుల సంఘాల హెచ్చరిక
(అమరావతి-ఆంధ్రజ్యోతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిస్తే, అధికారంలోకి వచ్చాక పదవుల పంపిణీలో తమకు మొండిచేయి చూపారని దూదేకుల కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీ కోటాలో కానీ, మైనార్టీ కోటాలో కానీ తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. జనాభా దామాషా ప్రకారం కూడా జగన్ ప్రభుత్వం తమకు పదవులు కేటాయించలేదని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం ఓటు బ్యాంకుగా తమను వాడుకుందని విమర్శిస్తున్నారు. ముస్లింలో ఉపకులంగా (నూర్‌బాష, లధాఫ్, పింజరి, మన్సూరి) ఉన్నామని ఆ సంఘాలు తెలిపాయి. రాష్ట్రంలో ముస్లిం జనాభా 60 లక్షలు మంది ఉంటే వారిలో దాదాపు 20-25 లక్షల మంది దూదేకులు ఉంటారని, అంటే 30-35 శాతం మంది ఉంటారని వెల్లడించాయి. బీసీ-బీ కేటగిరిలో ఉన్నట్టు తెలిపాయి. జనాభా దామాషా ప్రకారం గణనీయంగా ఉన్నా పదవుల కేటాయింపులో వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని వాపోయారు. రెండున్నరేళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో ఎన్నో పదవులను ప్రకటించినా తమకు సముచిత స్థానం కల్పించలేదని విమర్శించారు.
రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవుల్లో తమ తోటి ముస్లిం సోదరులకు వివిధ రకాలుగా 12 చైర్మన్ పదవులు ఇచ్చారని, తమకు ఒక్క చైర్మన్ పదవి మాత్రమే ఇచ్చారని వాపోయారు. అలాగే 480 కార్పొరేషన్ డైరెక్టర్ల పదవుల్లో ముస్లింలకు 31 మందికి పదవులు ఇచ్చారని, దూదేకుల కులస్తులకు ఒక్కటీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపు, ఎమ్మెల్సీ పదవులు, మున్సిపల్, నగర పాలక సంస్థల పదవుల్లో ముస్లింలకు 200 వరకు కల్పించారని, తమకు మాత్రం 10 చిన్నా చితకా పదవులతో సరిపెట్టారని విమర్శించారు. ముఖ్యమైన వక్ఫ్‌బోర్డు, హజ్ కమిటీ, మైనార్టీ కమిషన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ లాంటి వాటిలో తమకు తగిన స్థానం కల్పించలేదని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.
మాకు న్యాయం చేయాలి
గత ఎన్నికల ముందు దూదేకుల కులస్తుల యువత మొత్తం జెండాలు పట్టుకుని జగన్‌కు జేజేలు పలికింది. ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేశాం. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక దూదేకులకు మొండిచేయి చూపారు. ముస్లిం, మైనార్టీ శాఖల్లోని చైర్మన్లు, డైరెక్టర్ల కేటాయింపులోనూ అన్యాయం చేశారు. రాష్ట్రంలో ముస్లిం జనాభాలో 35 శాతంగా ఉన్న మాకు ప్రభుత్వ, నామినేటెడ్ పదవుల కేటాయింపులో న్యాయం చేయాలి. - షేక్ సత్తార్ సాహెబ్, రాష్ట్ర నూర్ బాష/దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు.
పదవుల పంపిణీలో అన్యాయం
దూదేకుల కులస్తులకు మంచి భవిష్యత్తు ఉంటుందని జగన్‌ను నమ్మి 2019 ఎన్నికల్లో ఓట్లు వేశాం. కులస్తులతోనూ వేయించాం. రెండేళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో ఎన్నో పదవు లు ప్రకటించారు. దూదేకులకు మాత్రం సముచిత స్థానం కల్పించలేదు. -పి.షేక్ షా వలి, నూర్ బాష మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి .