విద్యాశాఖ ‘యాప్‌’లు వద్దు

ABN , First Publish Date - 2021-11-02T08:27:52+05:30 IST

రాష్ట్రంలో విద్యాశాఖ తీసుకువచ్చిన పలు యాప్‌ల కారణంగా బోధన కుంటుపడుతోందని, యాప్‌లను రద్దు చేయాలని రాయలసీమ జిల్లాల ఎస్టీయూ నేతలు డిమాండ్‌ చేశారు.

విద్యాశాఖ ‘యాప్‌’లు వద్దు

  • ఎస్టీయూ సీమ నేతల నిరసన


కడప(ఎడ్యుకేషన్‌), నవంబరు 1: రాష్ట్రంలో విద్యాశాఖ తీసుకువచ్చిన పలు యాప్‌ల కారణంగా బోధన కుంటుపడుతోందని, యాప్‌లను రద్దు చేయాలని రాయలసీమ జిల్లాల ఎస్టీయూ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కడపలోని ప్రాంతీయ సంయుక్త సంచాలకుల(ఆర్జేడీ) కార్యాలయం వద్ద ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం ఏడీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాప్‌ల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, విద్యాశాఖ అధికారులకు, ప్రభుత్వానికి చెప్పినా ఫలితం లేదని ఆరోపించారు. యాప్‌ల వల్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి ఎక్కువైందని, తాఖీదులు ఇస్తున్నారని దానివల్ల ఉపాధ్యాయుల్లో మనోవేదన ఎక్కువైందని తెలిపారు.


ఇటీవల గుడ్లు, చిక్కీలు యాప్‌లో పొందుపరచని కారణంగా చాలామంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారని.. ఇది దారుణమని అన్నారు. టీచర్లను కేవలం బోధనకే పరిమితం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కడప జిల్లా ఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు బాలగంగిరెడ్డి, ఇలియాస్‌ బాష, చిత్తూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మురళీ, మోహన్‌రెడ్డి, కర్నూలు జిల్లా నుంచి శివశంకర్‌, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-02T08:27:52+05:30 IST