‘సోషల్‌’ పోస్టుల నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2021-12-31T07:44:58+05:30 IST

‘సోషల్‌’ పోస్టుల నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దు

‘సోషల్‌’ పోస్టుల నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దు

ఇస్తే వేరే పేరుతో పోస్టులు పెట్టే చాన్సు

హైకోర్టుకు సీబీఐ నివేదన...తీర్పు వాయిదా


అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని హైకోర్టును సీబీఐ కోరింది. బెయిల్‌ ఇస్తే మరో పేరుతో పోస్టులు పెట్టే అవకాశముందని తెలిపారు. ఇప్పటికే కొందరు నిందితులు తప్పుడు పేరుతో సోషల్‌ మీడియాలో అకౌంట్లు తెరిచి పోస్టులు పెట్టారని గుర్తుచేసింది. ఇరు పక్షాల వాదనలు గురువారం ముగియడంతో ఆరుగురు నిందితుల బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ ఆదేశాలిచ్చారు. న్యాయవ్యవస, హైకోర్టు న్యాయమూర్తుల పట్ల సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ గత ఏడాది మే 26వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఐపీసీ 153ఏ, 504, 505(2) సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలో సెక్షన్‌ 67 కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో అవుతు శ్రీధర్‌రెడ్డి (ఏ-7), జలగం వెంకటసత్యనారాయణ (ఏ-8), గూడ శ్రీధర్‌రెడ్డి (ఏ-9), దరిశ కిశోర్‌కుమార్‌రెడ్డి(ఏ-10), సుస్వరం శ్రీనాథ్‌ (ఏ-12), సుద్దులూరి అజయ్‌ అమృత్‌ (ఏ-14)లను అరెస్టు చేసింది. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న వీరు బెయిల్‌ కోసం ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 4న న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో నిందితులు మళ్లీ వ్యాజ్యాలు దాఖలుచేశారు. అవి గురువారం విచారణకు వచ్చాయి. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టీ.ఎస్‌ రాజు వాదనలు వినిపించారు. ‘బెయిల్‌ కోసం నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు డిసెంబరు 4న ఒకసారి తిరస్కరించింది. అప్పటికీ..ఈ రోజుకీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులేదు. పరిస్థితుల్లో మార్పు లేకుండా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయడానికి వీల్లేదు. ప్రస్తుతం దర్యాప్తు పూర్తయి చార్జిషీటు కూడా దాఖలు చేశాం’ అని గుర్తుచేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్లు 60 రోజులకు పైగా జైలులో ఉన్నారు. దర్యాప్తు పూర్తి చేసి చార్జిసీటు దాఖలు చేశామని సీబీఐ చెబుతుంది. పిటిషనర్లపై నమోదైన సెక్షన్లు తీవ్రమైనవి కావు. బెయిల్‌ పిటిషన్లు తిరస్కరించిన నాటికీ, ఈ రోజుకూ పరిస్థితులు మారాయి. ఇదే వ్యవహారంపై పలువురు నిందితులకు బెయిల్‌ మంజూరైంది. ఈ ఆరుగురికి కూడా మంజూరు చేయండి’ అని కోరారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై నిర్ణయాన్ని వెల్లడించేందుకు తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2021-12-31T07:44:58+05:30 IST